గతేడాది కాలంగా ఐపీఎల్‌లో రిషభ్ పంత్ వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. మెగా వేలం -2025లో రూ. 27 కోట్ల రికార్డు ధరకు లక్నో సూపర్ జెయింట్స్ అతడిని కొనుగోలు చేసి.. కెప్టెన్సీ అప్పగించింది. అయితే, అప్పటి నుంచి ఆటగాడిగా, సారథిగా పంత్ విఫలమవుతూనే ఉన్నాడు.
ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్
ఈ ఏడాది లీగ్ దశలో తొలి పదకొండు మ్యాచ్‌లలో లక్నో కేవలం మూడే గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ క్రమంలో సొంతమైదానం ఏకనాలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం లక్నో అదరగొట్టింది.
తొలుత చెన్నైని 187 పరుగులకే కట్టడి చేసిన లక్నో.. లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా సీజన్‌లో నాలుగో విజయం నమోదు చేయడంతో పాటు.. చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పంత్ (Rishabh Pant) అసలు బ్యాటింగ్‌కే రాలేదు.
స్లో ఓవర్ రేటు.. జరిమానా
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో లక్నో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. నిర్ణీత సమయంలో తమ 20 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయలేదు. ఫలితంగా లక్నో కెప్టెన్ పంత్‌కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. ఈ సీజన్‌లో లక్నో తొలిసారి ఈ తప్పిదానికి పాల్పడింది కాబట్టి.. రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు తెలిపింది.
ఆ సారథుల సరసన పంత్
కాగా ఐపీఎల్-2026లో స్లో ఓవర్ రేటు విషయంలో ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి తప్పిదానికి రూ. 12 లక్షలు.. రెండో తప్పిదానికి రూ.24 లక్షలు మూల్యంగా చెల్లించుకున్నాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ సారథి శుబ్‌మన్ గిల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ముంబై ఇండియన్స్ నాయకుడు హార్దిక్ పాండ్యా, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నాయకుడు ప్యాట్ కమిన్స్ తమ తొలి తప్పిదానికి ప్రతిగా రూ. 12 లక్షల జరిమానా కట్టారు. తాజాగా పంత్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
లక్నో వర్సెస్ చెన్నై సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 187/5(20)
లక్నో: 188/3(16.4)
ఫలితం: ఏడు వికెట్ల తేడాతో చెన్నైపై లక్నో గెలుపు.
చదవండి: Ruturaj Gaikwad: మా ఓటమికి కారణం వాళ్లే
Stormed to 2️⃣ points in absolute style 😎@LucknowIPL wrap a blistering chase at home 🏡
Scorecard ▶️ https://t.co/v1R8RJXPe8#TATAIPL | #KhelBindaas | #LSGvCSK pic.twitter.com/EwqhdUW1L5— IndianPremierLeague (@IPL) May 15, 2026


