పాక్‌ వికెట్‌ కీపర్‌ ఖాతాలో అరుదైన రికార్డులు

Pakistan Wicket Keeper Mohammad Rizwan Bags Five Records With One Century - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లాహోర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అజేయమైన సెంచరీతో కదం తొక్కిన పాక్‌ వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌(104 నాటౌట్; 64 బంతుల్లో 6x4, 7x6), అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్న రిజ్వాన్‌.. పాక్‌ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మట్లలో (వన్డే, టెస్టు, టీ20ల్లో) శతకం బాదిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

గతంలో ఈ ఫీట్‌ను న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ మాత్రమే సాధించాడు. మెక్‌కల్లమ్‌ టెస్ట్‌ల్లో 5, వన్డేల్లో 3, టీ20ల్లో ఒక శతకం నమోదు చేయగా, రిజ్వాన్ వన్డేల్లో 2, టెస్టుల్లో 1, టీ20ల్లో1 సెంచరీ చేశాడు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన ఐదో వికెట్ కీపర్‌గా రిజ్వాన్ నిలిచాడు. మెక్‌కల్లమ్‌, అహ్మద్ షాజాద్, మోర్న్ వాన్ విక్, లెస్లీ డన్బార్ తరువాత రిజ్వాన్‌ ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్ కూడా రిజ్వానే కావడం విశేషం. 

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన రెండో పాక్‌ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. అంతకుముందు అహ్మద్ షాజాద్ మత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు. మొత్తానికి రిజ్వాన్ ఒక్క సెంచరీతో ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, పాక్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను కోల్పోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top