
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌కు ఇదివరకే పాకిస్తాన్ జట్టు దూరంగా ఉంది. ఇప్పుడు ఆ దేశ దిగ్గజం సొహైల్ అబ్బాస్ కూడా మలేసియా జట్టు అసిస్టెంట్ కోచ్ హోదాలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఈ మేరకు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే టోరీ్నకి అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. పాక్ దిగ్గజ డ్రాగ్‌ఫ్లికర్‌గా ఖ్యాతి గడించిన అతను ప్రస్తుతం మలేసియా హాకీ జట్టుకు సేవలందిస్తున్నారు. ఈ జట్టు ఆసియా కప్ కోసం భారత్‌కు రానుంది.
ఈ టోర్నీ విజేత నేరుగా ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆసియా ఈవెంట్‌కు మలేసియా జట్టు తరఫున వచ్చేందుకు అనాసక్తి చూపడం విడ్డూరంగా ఉంది. అయితే తన నిర్ణయానికి స్వదేశం (పాక్) తీసుకున్న గైర్హాజరుకు సంబంధం లేదని అబ్బాస్ చెప్పుకొచ్చాడు.
‘నేను ఆసియా కప్ కోసం భారత్‌కు వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఆ ఈవెంట్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇది నా సొంత నిర్ణయం. దీనిపై ఎవరి ప్రభావం లేదు’ అని అన్నాడు. అబ్బాస్ 2012లో అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పారు.
ఆ తర్వాత 2024 వరకు లోప్రొఫైల్ జీవితాన్నే గడిపారు. గతేడాది మలేసియా కోచింగ్ బృందంలో చేరారు. 48 ఏళ్ల సొహైల్ అబ్బాస్ ఏకంగా నాలుగు ప్రపంచకప్‌లు (1998, 2002, 2006, 2010), మూడు ఒలింపిక్స్ (2000, 2004, 2012)లలో పాల్గొన్నారు.
1998, ఫిబ్రవరిలో భారత్‌తో పెషావర్‌లో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అబ్బాస్ 311 మ్యాచ్‌లు ఆడి 21 సార్లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. భారత్‌లో 20 ఏళ్ల క్రితం జరిగిన ఇండియన్ ప్రీమియర్ హాకీ లీగ్‌లో విజేత హైదరాబాద్ సుల్తాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.