ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్‌ లేదన్నారు: శార్దూల్‌ ఠాకూర్‌

Once Shardul Thakur Trolled By Sachin Fans For Wearing 10 Number Jersey - Sakshi

లండన్‌: ఓవల్‌ టెస్ట్‌ విజయం అనంతరం టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగల్లో సత్తా చాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పేలవ బ్యాటింగ్‌ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో పేక మేడలా కుప్పకూలుతున్న జట్టును శార్దూల్‌ తన మెరుపు అర్ధశతకంతో ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ను చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌తో కలిసి అతను నెలకొల్పిన శతక భాగస్వామ్యం జట్టు విజయానికి బాటలు వేసింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకుపోయిన రోరీ బర్న్స్‌ను ఔట్‌ చేసి తొలి వికెట్‌ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణకు తెరదించిన శార్దూల్‌.. అత్యంత కీలకమైన జో రూట్‌ వికెట్‌ను కూడా పడగొట్టి టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు. 

ఇదిలా ఉంటే, ఓవల్‌ టెస్ట్‌ తర్వాత రాత్రికిరాత్రే స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నశార్డూల్ ఠాకూర్‌ కూడా చాలామంది స్టార్‌ క్రికెటర్లలాగే ఎన్నో కష్టాలు దాటి ఈ స్థాయికి చేరాడు. కెరీర్ ప్రారంభంలో గాయాలతో సతమతమయ్యి, భారీగా బరువు పెరిగిన ఇతను.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. తన బర్త్ డే నెల కలిసొచ్చేలా మొదట్లో జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగిన శార్దూల్.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ‘నీ ముఖానికి అంత సీన్ లేదంటూ' ఘాటు విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, స్వతాహాగా సచిన్ అభిమాని అయిన శార్దూల్‌.. వెంటనే తన తప్పిదాన్ని గుర్తించి తన జెర్సీ నెంబర్‌ను 54గా మార్చుకున్నాడు. కాగా, ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన అనంతరం శార్దూల్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏ అభిమానుల చేత ట్రోలింగ్‌కు గురయ్యాడో వారి చేతనే ప్రస్తుతం శభాష్ అనిపించుకున్నాడు. అతని ఆరాధ్య దైవమైన సచిన్‌ కూడా అతన్ని ప్రశంసించడంతో శార్దూల్ ఆనందానికి అవధుల్లేవు.
చదవండి: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. బట్లర్‌, లీచ్‌ రీ ఎంట్రీ
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top