WC 2023: జడ్డూ.. లేదంటే అక్షర్‌! చహల్‌ కంటే అతడు బెటర్‌.. కుల్దీప్‌ కూడా: మాజీ సెలక్టర్‌

ODI WC 2023: Former India Selector Picks Kuldeep Ahead Of Chahal - Sakshi

ICC ODI World Cup 2023- Kul-Cha Spin Duo: ‘‘సుదీర్ఘ కెరీర్‌లో ప్రతి బౌలర్‌ కెరీర్‌లో ఇలాంటి దశను ఎదుర్కోవడం సహజం. ప్రస్తుతం చహల్‌ అదే స్థితిలో ఉన్నాడు. మేనేజ్‌మెంట్‌ను రిక్వెస్ట్‌ చేసి తను దేశవాళీ క్రికెట్‌ ఆడితే బాగుంటుంది. పూర్తిస్థాయిలో తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి.

ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా చహల్‌ ఈ మేరకు సన్నద్ధం కావాల్సి ఉంది’’ అని టీమిండియా మాజీ సెలక్టర్‌ సునిల్‌ జోషి అన్నాడు. ఇక వన్డే ప్రపంచకప్‌-2023 నేపథ్యంలో తానైతే ‘కుల్‌-చా’ స్పిన్‌ ద్వయంలో కుల్దీప్‌ యాదవ్‌కే ఓటు వేస్తానని పేర్కొన్నాడు.

చహల్‌ ఇప్పటి వరకు ఇలా
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వన్డేల్లో మూడు వికెట్లు పడగొట్టాడు లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో  2/43, శ్రీలంకతో వన్డేలో 1/58 గణాంకాలు నమోదు చేశాడు. ఇక టీ20ల విషయానికొస్తే.. ఇప్పటి వరకు నాలుగు వికెట్లు చహల్‌ ఖాతాలో ఉన్నాయి.

జడ్డూ ఉంటాడు.. బ్యాకప్‌గా అతడే
ఈ నేపథ్యంలో ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో ముచ్చటించిన సునిల్‌ జోషి.. తన ప్రపంచకప్‌ జట్టులో చహల్‌కు చోటు ఇవ్వలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘15 మంది సభ్యులతో కూడిన జట్టు గురించి మాట్లాడినట్లయితే.. నా టీమ్‌లో జడేజా ఉంటాడు. ఒకవేళ తను ఫిట్‌గా లేనట్లయితే బ్యాకప్‌గా అక్షర్‌ పటేల్‌ ఉండాలి.

ఆ తర్వాత వాషీ(వాషింగ్టన్‌ సుందర్‌). ఒకవేళ మరో లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కావాలనుకుంటే రవి బిష్ణోయి జట్టులో ఉండాలి. ఎందుకంటే రవి నిలకడైన ప్రదర్శన కనబరచగలడు. వరుస విరామాల్లో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. అంతేకాదు.. రవి బిష్ణోయి.. చహల్‌ కంటే మెరుగ్గా ఫీల్డింగ్‌ చేయగలడు’’ అని సునిల్‌ జోషి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

భిన్న పరిస్థితుల నడుమ
ఇక చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ గురించి చెబుతూ.. ‘‘కుల్దీప్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, మరింత నిలకడగా రాణించాల్సి ఉంది. భారత్‌లో ప్రపంచకప్‌ జరుగబోతోంది. ఇక్కడ విభిన్న తరహా మైదానాలు ఉన్నాయి. పిచ్‌, వాతావరణ పరిస్థితులు ఎక్కడిక్కడ భిన్నంగా ఉంటాయి.

కాబట్టి వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టును ఒక్కో మైదానంలో ఎదుర్కొనేందుకు ఏ మేర సంసిద్ధమవుతాడనే అంశం మీదే తన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది’’ అని సునిల్‌ జోషి చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కూడా కుల్దీప్‌ పాత్ర కీలకం కానుందని సునిల్‌ అంచనా వేశాడు.

అదరగొడుతున్న కుల్దీప్‌
ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో రెండు వన్డేల్లో ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్‌ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్‌ మాజీ బౌలర్‌
Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top