Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది

Women World Cup 2023: U-19 Women Crickter Archana Devi Full Story - Sakshi

తల్లికి వందనం

‘కూతుర్ని ఎవరికో అమ్మేసింది. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది’... భర్త చనిపోయిన సావిత్రి తన కూతుర్ని పొరుగూరి స్కూల్లో చేర్చాక ఊరి ఆడవాళ్ల నుంచి ఎదుర్కొన్న నింద అది. ‘ఏమైనా సరే నా కూతురు క్రికెట్‌ ఆడాలి’ అనుకుంది సావిత్రి. అందుకే ఘోరమైన పేదరికంలో కూడా కూతురి కలలకు అండగా నిలబడింది. ఇవాళ ఆ కూతురు– అర్చనా దేవి ప్రపంచ విజేతగా నిలిచింది. ‘అండర్‌– 19’ క్రికెట్‌ జట్టులో బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించి ఫైనల్స్‌ గెలవడంలో కీలకంగా మారింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని
తల్లులకు ఈ స్ఫూర్తిగాథ సందేశం ఇస్తోంది.

సౌత్‌ ఆఫ్రికాలో అండర్‌ 19 టి 20 మహిళా ప్రపంచకప్‌. 16 దేశాలు తలపడ్డాయి. మన అమ్మాయిలు కప్‌ సాధించారు. మొత్తం 16 మంది టీమ్‌. ఒక్కొక్కరు శివంగిలా మారి అన్ని జట్లతో తలపడ్డారు. ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను అతి తక్కువ స్కోర్‌ (68) వద్ద కట్టడి చేసి 14 ఓవర్లకే మూడు వికెట్ల నష్టానికి విజయం సాధించారు. ఇంగ్లాండ్‌ జట్టును బౌలర్లు హడలగొట్టారు. వారిలో టిటాస్‌ సాధు, పార్శవి కాకుండా మూడో బౌలర్‌ ఉంది. అర్చనా దేవి. కీలకమైన రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒక అద్భుతమైన క్యాచ్‌ పట్టి మూడవ వికెట్‌ పడేందుకు కారణమైంది. వరల్డ్‌ కప్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక విజయగాథే అయినా అర్చనా దేవిది భిన్నమైనది.

కష్టాలను తట్టుకుని
అర్చనా దేవి (18) సొంత ఊరు ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్‌ జిల్లాలోని రతై పూర్వ. గంగానది ఒడ్డునే వీరి పొలం. ఊరు. వరదలతో ఆ పొలం సంవత్సరంలో సగం రోజులు మునకలో ఉండేది. మిగిలిన సగం రోజుల్లో తండ్రి శివరామ్‌ వ్యవసాయం సాగించేవాడు. కాని ఆయనను 2008లో కేన్సర్‌ కబళించింది. దాంతో ఊళ్లో ఆడవాళ్లందరూ అర్చనా తల్లి సావిత్రిదేవిని నష్ట జాతకురాలిగా పరిగణించసాగారు. సావిత్రి వెరవలేదు. ఇద్దరు కొడుకులను, కూతురైన అర్చనను రెక్కల కింద పెట్టుకుని సాకసాగింది. దురదృష్టం... ఆఖరు కొడుకు బుద్ధిమాన్‌ కూడా మరణించాడు. దాంతో సావిత్రిని చూస్తే చాలు ఊరు దడుచుకునేది. ‘ఇదో మంత్రగత్తె. మొదట భర్తను మింగింది. తర్వాత కొడుకును’ అని... ఎదురుపడితే పక్కకు తప్పుకునేవారు. సావిత్రి దేవి ఇంకా రాటు దేలింది. పిల్లల కోసం ఎలాగైనా బతకాలనుకుంది.

కూతురి క్రికెట్‌
అర్చనకు క్రికెట్‌ పై ఆసక్తి, పట్టు కూడా సోదరుడు బుద్ధిమాన్‌ వల్ల వచ్చినవే. అతను అర్చనను వెంటబెట్టుకుని పొలాల్లో క్రికెట్‌ ఆడేవాడు. తోడుగా అర్చన బ్యాటు ఝళిపించేది. అర్చన టాలెంట్‌ను బుద్ధిమాన్‌ వెంటనే గమనించాడు. ‘నువ్వు క్రికెటర్‌వి కావాలి’ అనేవాడు. అర్చన ఆశలు పెట్టుకుంది కాని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధిమాన్‌ బాల్‌ని కొడితే అది దూరంగా చెత్తలో పడింది. వెళ్లి చేతులతో చెత్తను కదిలిస్తూ ఉంటే పాము కరిచింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుంటే కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్‌ ‘అర్చనను క్రికెట్‌ మాన్పించవద్దు’ అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్‌ చేయాలని.

స్కూల్‌లో చేర్చి
అర్చన క్రికెట్‌ కొనసాగాలంటే చదువును, ఆటలను నేర్పించే స్కూల్లో చేర్పించాలని సావిత్రి నిశ్చయించుకుంది. తమ పల్లెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గంజ్‌ మొరాదాబాద్‌లోని గర్ల్స్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించింది. వాళ్లుండే పల్లె నుంచి అలా మరో ఊరి బోర్డింగ్‌ స్కూల్‌లో ఏ ఆడపిల్లా చేరలేదు. అందుకని ఊరి ఆడవాళ్లు సావిత్రిని అనుమానించారు. కూతుర్ని ఎవరికో మంచి బేరానికి అమ్మేసి ఉంటుందని అనేవారు. చెడ్డ పనుల కోసం ఊరు దాటించింది అనేవారు. అవన్నీ సావిత్రీదేవి నిశ్శబ్దంగా భరించింది. కొడుకును ఢిల్లీలో బట్టల ఫ్యాక్టరీలో పనికి పెట్టి తమకున్న ఒక ఆవు, ఒక బర్రె పాల మీద ఆధారపడి కూతురి ఖర్చులను అతి కష్టం మీద చూసేది. ‘నేను ఉన్నాను’ అని అర్చనకు ధైర్యం చెప్పేది.

దశ తిరిగింది
బోర్డింగ్‌ స్కూల్లోని ఒక టీచరు అర్చన ప్రతిభను గమనించి కాన్పూరులో ఉండే కోచ్‌ కపిల్‌ పాండే దృష్టికి తీసుకెళ్లింది. ఆ టీచరు తీసిన అర్చన బౌలింగ్‌ వీడియోలు చూసిన కపిల్‌ పాండే వెంటనే కాన్పూరుకు పిలిపించి అక్కడి క్రికెట్‌ అసోసియేషన్‌లో జాయిన్‌ చేసి తన శిష్యురాలిగా తీసుకున్నాడు. కపిల్‌ పాండే క్రికెటర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు కూడా కోచ్‌ కావడంతో కుల్‌దీప్‌ యాదవ్‌ అర్చనను ప్రోత్సహించాడు. ఆమె శిక్షణకు సాయం అందించాడు.

అతిథులయ్యారు
‘ఒకప్పుడు మా ఇంట నీళ్లు కూడా ఎవరూ తాగలేదు. ఇవాళ అందరూ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగింది అని భోజనం చేస్తున్నారు’ అంది అర్చన తల్లి సావిత్రి. వాళ్ల ఊరిలో ఆ కుటుంబం ఇప్పుడు సగర్వంగా నిలబడింది. తల్లి తన కూతురి ద్వారా అలా నిలబెట్టుకుంది. ఆ తల్లీకూతుళ్లను చూసి ఊరు మురిసిపోతోందిగాని అది ఎన్నో ఎదురీతల ఫలితం. ఎవరో అన్నట్టు... అపజయాల ఆవల విజయ తీరం ఉంటుంది.
అర్చన విజయానికి తెడ్డు వేసిన నావ– ఆ తల్లి సావిత్రీ దేవి. అందుకే అర్చన విజయంలో సగం ఆ తల్లిదే.                                              

ఇంగ్లాండ్‌తో ఫైనల్స్‌లో అర్చన క్యాచ్‌

ప్రపంచ విజేత మన జట్టు

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top