NZ vs IND: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. పంత్‌కు నో ఛాన్స్‌! దీపక్‌ వైపే మొగ్గు

NZ vs IND 2nd ODI: predicted Indias Playing XI - Sakshi

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హామిల్టన్‌ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.

ఇప్పటికే హామిల్టన్‌కు చేరుకున్న ధావన్‌ సేన నెట్‌ ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. ఇక తొలి వన్డేలో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. తొలి పవర్‌ ప్లేలో భారత బౌలర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

పంత్‌కు నో చాన్స్‌..
ఇక కీలకమైన రెండో వన్డేలో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న పంత్‌ స్థానంలో దీపక్‌ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పంత్‌ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఒక వేళ పంత్‌ మ్యాచ్‌కు దూరమైతే ధావన్‌ డిప్యూటీగా శ్రేయస్‌ అయ్యర్‌ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. 

 అదే విధంగా తొలి వన్డేలో దారుణంగా విఫలమైన యుజువేంద్ర చాహల్‌ స్థానంలో చైనామాన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజేమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా తొలి వన్డేలో చాహల్‌ తన 10 ఓవర్ల కోటాలో వికెట్లు ఏమీ సాధించకుండా 67 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు దీపక్‌ చాహర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే.. శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

వర్షం ముప్పు
భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేకు వర్షం​ అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం హామిల్టన్‌లో 91 శాతం వర్షం పడే ఛాన్స్‌ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది
చదవండిJasprit Bumrah: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. యార్కర్ల కింగ్‌ వచ్చేస్తున్నాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top