ఆర్సీబీకి షాక్‌.. కేసు వెనక్కు తీసుకున్న బౌలర్‌ | Nuwan Thushara Leaves RCB In Troubled Waters With Shocking U Turn | Sakshi
Sakshi News home page

ఆర్సీబీకి షాక్‌.. కేసు వెనక్కు తీసుకున్న బౌలర్‌

Apr 23 2026 1:34 PM | Updated on Apr 23 2026 1:41 PM

Nuwan Thushara Leaves RCB In Troubled Waters With Shocking U Turn

శ్రీలంక ఆటగాడు నువాన్‌ తుషార వ్యవహారం ప్రస్తుత ఐపీఎల్‌ ఛాంపియన్‌ ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్‌ 2026లో పాల్గొనేందుకు తుషారకు అతని సొంత దేశ క్రికెట్‌ బోర్డు (శ్రీలంక క్రికెట్‌) అనుమతి నిరాకరించింది. ఫిట్‌నెస్‌ లేని కారణంగా తుషారకు ఎన్‌వోసీ జారీ చేయలేమని తెలిపింది.

ఈ విషయమై కోర్టును ఆశ్రయించిన తుషార.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కోర్టు శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ పరిణామం తర్వాత తుషార ఇక ఐపీఎల్ ఆడటం కష్టమేనని తేలిపోయింది.

తుషార వ్యవహారంలో కోర్టు తీర్పు ఆర్సీబీని ఇరకాటంలో పడేసింది. ఆ జట్టు ఈ సీజన్‌లో తుషారపై ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, గత సీజన్‌లో అతను హాజిల్‌వుడ్‌ గైర్హాజరీలో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతని యార్కర్లు, స్లో బంతులు డెత్ ఓవర్లలో ఆర్సీబీ​కి కీలకంగా మారే అవకాశం ఉండింది.

ప్రస్తుతం ఆర్సీబీకి హాజిల్‌వుడ్‌, డఫీ, ఎంగిడి వంటి విదేశీ పేస్‌ బౌలింగ్‌ ఆప్షన్స్‌ ఉన్నప్పటికీ.. తుషార లాంటి డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ ఉంటే అదనపు బలంగా మారే అవకాశం ఉండింది. మొత్తంగా తుషార న్యాయపోరాటం చేస్తూ మధ్యలోనే యూ-టర్న్‌ తీసుకోవడం ఆర్సీబీకి వ్యూహాత్మక నష్టంగా పరిగణించాలి. ప్లే ఆఫ్స్‌ రేసులో పోటీ తీవ్రంగా ఉన్న దశలో ఇలాంటి మార్పులు జట్టు సమతుల్యతను దెబ్బతీస్తాయి.

కాగా, తుషార లేకపోయినా ఆర్సీబీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగానే రాణిస్తుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్‌ 24న జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement