చెన్నై: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం నేడు ఓ చారిత్రక ఘట్టానికి సాక్షీగా నిలవనుంది. గత 37 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యే మారుతున్న అధికార పీఠం.. ఈసారి ఒక కొత్త సవాలును ఎదుర్కొంటోంది. కరుణానిధి సైతం వరుసగా రెండుసార్లు అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయిన చరిత్రను తిరగరాయాలని డీఎంకే ఉవ్విళ్లూరుతోంది. నేడు 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నాలుగు దశాబ్దాల ద్రవిడ ద్వయం ఆధిపత్యానికి ముగింపు పలకగల సత్తా దళపతి విజయ్‌కు ఉందా?.. దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
విజయ్ సృష్టిస్తున్న ప్రకంపనలు
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తన ‘తమిళగ వెట్రి కజగం (TVK)’ పార్టీతో విజయ్ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ముఖ్యంగా యువత, మహిళల్లో ఆయనకు విశేషమైన మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అధికార డీఎంకే పార్టీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ 'దుష్టశక్తి'గా అభివర్ణించిన విజయ్.. వ్యూహాత్మకంగా అన్నాడీఎంకేను పెద్దగా విమర్శించలేదు. ప్రత్యామ్నాయం లేక గతంలో అన్నాడీఎంకేకు ఓటేసిన డీఎంకే వ్యతిరేక ఓటర్లను ఆకర్షించడమే ఆయన లక్ష్యం. అయితే ఈ ఓట్ల చీలిక అన్నాడీఎంకేను దెబ్బతీసి పరోక్షంగా స్టాలిన్‌కే లాభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని 5.68 కోట్ల ఓటర్లలో దాదాపు 40 శాతం మంది 39 ఏళ్ల లోపు వారే ఉండటం విజయ్‌కు సానుకూలాంశం. ఓటర్లకు డబ్బులు పంచకూడదన్న ఆయన నిర్ణయం, సిస్టమ్‌లో మార్పును కోరుకునే వర్గాలను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ద్రవిడ పార్టీల స్థిరమైన ఓటు బ్యాంకు
తమిళ రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు దశాబ్దాలుగా చెక్కుచెదరని 20 శాతానికి పైగా స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ‘ఉదయించే సూర్యుడు’, ‘రెండు ఆకులు’ గుర్తులకు వీరు కట్టుబడి ఉంటారు. 1991లో డీఎంకే కేవలం రెండు సీట్లకు పరిమితమైనా 22.46% ఓట్లు సాధించింది. 1996లో అన్నాడీఎంకే ఘోరంగా నాలుగు సీట్లే గెలిచినా 21.47% ఓట్లు దక్కించుకుంది. ఇప్పుడు విజయ్ 20 శాతం ఓట్లు సాధించినా అవి భారీ సంఖ్యలో సీట్లుగా మారుతాయా అనేది ప్రశ్నార్థకమే. అయితే తొలి ప్రయాణంలోనే ఓ మోస్తరు సీట్లు సాధించినా అది రాజకీయంగా ఒక చరిత్రే. మరోవైపు, మైనారిటీ ఓట్ల విషయంలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కారణంగా ముస్లింలు డీఎంకే వైపు ఏకపక్షంగా మొగ్గుచూపుతుండగా, క్రిస్టియన్ యువతలో ఒక వర్గం విజయ్ వైపు ఆకర్షితులవుతున్నారు. క్షేత్రస్థాయిలో చివరి నిమిషంలో జరిగే నగదు పంపిణీ కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందనే వాదన వినిపిస్తోంది.
స్టాలిన్, పళనిస్వామిలకు చావో రేవో
ఈ ఎన్నికలు ఇద్దరు ద్రవిడ దిగ్గజాలకు అత్యంత కీలకం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి ఇది దాదాపు జీవన్మరణ సమస్య లాంటిది. 2021 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుస దెబ్బలు తిన్న అన్నాడీఎంకే.. మరోసారి ఓడిపోతే పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం తలెత్తుతుంది. ఓపీఎస్, శశికళ వర్గాలను దూరం పెట్టి పార్టీపై పూర్తి పట్టు సాధించిన ఆయన, దినకరన్‌తో పొత్తు పెట్టుకుని తన నాయకత్వ పటిమను నిరూపించుకోవాల్సి ఉంది. శశికళ కొత్త పార్టీ పెట్టి అన్నాడీఎంకే ఓట్లకు గండికొట్టాలని చూస్తున్నారు. మరోవైపు, 73 ఏళ్ల సీఎం స్టాలిన్‌కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ విజయం భవిష్యత్తులో తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి మార్గం సుగమం చేస్తుంది. ‘ఇండియా’ కూటమికి కూడా ఈ విజయం కీలకం కానుంది.


