నందిగ్రామ్ సెగలు: పోలీసులపై సువేందు ఫైర్ | Nandigram High Tension Suvendu Alleges Police Bias | Sakshi
Sakshi News home page

నందిగ్రామ్ సెగలు: పోలీసులపై సువేందు ఫైర్

Apr 23 2026 1:52 PM | Updated on Apr 23 2026 3:16 PM

Nandigram High Tension Suvendu Alleges Police Bias

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. రాజకీయంగా కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేసిన సంచలన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పోలీసుల పక్షపాత వైఖరిపై ఫైర్
తమ పోలింగ్ ఏజెంట్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల నుంచి బరిలో ఉన్న సువేందు అధికారి ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల తటస్థతపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా పింగ్లా పోలీస్ స్టేషన్ ఓసీ చిన్మోయ్ ప్రమాణిక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) మనోజ్ అగర్వాల్, పోలీసు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు.
 

‘ఆ గూండాలతోనే నా పోరాటం’
ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని సువేందు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘హత్య కేసులో నిందితుడైన షేక్ షాహుద్దీన్ ఓటర్లను బెదిరిస్తున్నాడు. నేను దేనికీ భయపడను. నా పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం టీఎంసీ గూండాలపైనే నా యుద్ధం’ అని ఆయన పేర్కొన్నారు. బిన్‌పూర్, ఖరగ్‌పూర్ లాంటి ఇతర ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఏజెంట్లను బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి కూడా నందిగ్రామ్‌లో టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement