పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ ఆధిపత్య ప్రయత్నాలతో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఓ క్లారిటీ ఇచ్చింది.
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి కనీసం మరో ఆరు నెలల టైం పట్టవచ్చని తాజాగా పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులతో ఆ విభాగం రహస్యంగా ఓ సమావేశం నిర్వహించిందని.. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలకమైన నివేదికను అక్కడి సభ్యులకు వివరించిందన్నది ఆ కథనం సారాంశం. అయితే..
ఈ జాప్యానికి శాంతి చర్చలతో సంబంధం లేదని తెలుస్తోంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే ఈ ఆలస్యం జరగవచ్చని ఆ నివేదిక తెలిపింది. హర్ముజ్ రూట్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 కంటే ఎక్కువ మైన్స్‌నే అమర్చి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఇరాన్ జీపీసీ (Global Positioning Capability/Control) టెక్నాలజీ వాడింది. అందుకే వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. కాబట్టి.. వాటిని తొలగించడానికి టైం పట్టవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే..
ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో వాటి తొలగింపు ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుందని కూడా పెంటగాన్ నివేదిక స్పష్టం చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే పెంటగాన్ ఈ కథనాలను ధృవీకరించాల్సి ఉంది.
ఇరాన్ ఇటీవల హర్ముజ్ జలసంధి సముద్ర మైన్స్ (Sea Mines) గురించి పలు ప్రకటనలు చేసింది. ముఖ్యంగా, నౌకలు మైన్స్‌తో ఢీకొనే ప్రమాదం ఉందని హెచ్చరించి.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పలు దేశాల వాణిజ్య నౌకలకు సూచించింది. అయితే డీల్ కుదిరాక ఇరాన్ సహకారంతోనే సీ మైన్స్‌ను తొలగిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది జరిగే పని కాదంటూ ఇరాన్ ట్రంప్ ప్రకటనపై సెటైర్లు కూడా వేసింది.
ఏయే యుద్ధాల్లో వాడారంటే..
సీ మైన్స్ (Sea Mines) అనేవి సముద్రంలో ఉంచే పేలుడు పరికరాలు. ఇవి నౌకలు లేదంటే జలాంతర్గాములు (submarines) దగ్గరికి వచ్చినప్పుడు పేలిపోతాయి. చరిత్రలో అనేక యుద్ధాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు. 14వ శతాబ్దంలో చైనా సామ్రాజ్యంలో జపాన్ దొంగలపై వీటిని ఉపయోగించినట్లు చరిత్రలో ప్రస్తావన ఉంది. అమెరికన్ రెవల్యూషన్-సివిల్‌వార్ టైంలో అమెరికా తొలిసారిగా వాడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో.. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు కొరియా, వియత్నాం యుద్ధాల్లోనూ వీటిని వాడారు. రష్యా నౌకల కదలికలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్.. తాజాగా హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరులో ఇరాన్ వీటిని ఉపయోగించాయి.
ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు అంతరాయం కలుగుతూ వస్తోంది. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని ఇరాన్.. అలా కుదరదు స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అమెరికా వాదిస్తూ వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల(అణు ఒప్పందం ప్రధానంగా) కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో.. హర్ముజ్ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. కానీ, అమెరికా డిమాండ్లను ఇరాన్ తోసిపుచ్చడం, చర్చలకు(రెండో దఫా) ముందుకు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది.


