12 ఏళ్లుగా సుక్క ముట్టని ఆదర్శ గ్రామాలు | Alcohol free Villages in Nirmal district in Telangana | Sakshi
Sakshi News home page

12 ఏళ్లుగా సుక్క ముట్టని ఆదర్శ గ్రామాలు

Apr 23 2026 2:30 PM | Updated on Apr 23 2026 2:43 PM

Alcohol free Villages in Nirmal district in Telangana

మద్యానికి దూరంగా ఝరి(బి), హిప్నెల్లితండా, మొగ్లి గ్రామాలు

పార్టీలకు దూరంగా.. ఆధ్యాత్మికతకు దగ్గరగా... 

ఆదర్శంగా నిలుస్తున్న సరిహద్దు పల్లెలు..

పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. స్నేహితుడు కలిసినా.. బంధువు వచ్చినా.. శుభవార్త విన్నా.. చెడు కబురు అందినా.. ముచ్చట ఏదైనా.. మందు తాగుడు కామన్‌ అయింది. ఇక వీకెండ్‌ వచ్చిందంటే ఎంజాయ్‌ అంటూ పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మందు తాగడానికి కారణాలు వెతుక్కునే పరిస్థితి.. ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకూ విస్తరించింది. యువకుల నుంచి ముసలి వాళ్ల వరకు కారణం దొరికితే ముక్క, సుక్కతో దావత్‌ చేసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో తానూరు మండలంలోని మూడు గ్రామాలు.. మద్యానికి దూరంగా ఉంటున్నాయి. ఆయా గ్రామాల్లో జరిగిన సంఘటనలు అందరినీ ఆవైపు నడిపించాయి. ఆధ్యాత్మికబాట పట్టించాయి. మద్యనిషేధం తర్వాత గ్రామాలు ప్రశాంతంగా ఉంటున్నాయి.

తానూరు: నిర్మల్‌ జిల్లా తానూరు మండలం మూడు గ్రామాల వాసులు మద్యపాన నిషేధంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు అయిన ఝరి(బి), హిప్నెల్లితండా, మొగ్లి, మొగ్లి అనుబంధ మసల్గాతండా గ్రామస్తులు ఐక్యంగా మద్యనిషేధం అమలు చేస్తున్నారు. మద్యం దుకాణాలను మూసివేశారు. కట్టుబాటు పెట్టుకుని కఠినంగా నిషేధం అమలు చేస్తున్నారు. యువకులు, మహిళలే దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కట్టుబాటు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తూ మద్య రహితంగా మార్చారు.

గురువు ఉపదేశంతో.. 
ఝరి(బి)లో 12 ఏళ్లుగా మద్యనిషేధం అమలవుతోంది. మహారాష్ట్ర పర్భణి జిల్లాకు చెందిన శేషేరావ్‌ మహరాజ్‌ గ్రామానికి వచ్చి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఉపదేశంతో మద్యపాన నిషేధం ప్రారంభమైంది. ఇక మొగ్లి, మసల్గాతండల్లో రెండేళ్లుగా, హిప్నెల్లితండాలో ఆరు నెలలుగా మద్యనిషేధం కొనసాగుతోంది. మండల కేంద్రం నుంచి 14 కి.మీ. దూరంలోని ఈ గ్రామాల్లో మద్యం తాగి వచ్చినవారికి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. మద్యం అమ్మకుండా చూడాలని పోలీసులకు వినతిపత్రాలు ఇచ్చారు. పోలీసులు కూడా వీరికి మద్దతుగా ఉన్నారు. 

ఆత్మహత్యల కారణంగా.. 
గ్రామాల్లో మద్య నిషేధం అమలుకు ప్రధాన కారణం.. మద్యానికి బానిసైన వారు ఆత్మహత్యలు చేసుకోవడం. మద్యం మత్తులో ఏ పని చేయకుండా ఉండేవారు. దీంతో కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులతోపాటు గొడవలు జరిగేవి. ఈ కారణంగా పంచాయితీలు నిర్వహించారు. కుటుంబ కలహాల కారణంగా యజమానులు ఆత్మహత్య చేసుకునేవారు. కుటుంబాలు రోడ్డున పడి, పిల్లల చదువులు ఆగిపోయాయి. ఒక్క హిప్నెల్లి తండాలో ఏడేళ్లలో 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇక మొగ్లిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి చేశాడు. ఈ దుర్ఘటన కలకలం రేపి మద్య నిషేధానికి దారితీసింది.

ప్రశాంతంగా పల్లెలు.. 
మద్యనిషేధం అమలులో మహిళా సంఘాల సభ్యులు, యువకులే కీలక పాత్ర పోషించారు. గ్రామ పెద్దలను ఒప్పించి ఊరందరితో మద్యం తాగమని ప్రతిజ్ఞ చేయించారు. మద్యం అమ్మకాలు నిలిపివేయించారు. హిప్నెల్లితండాలో అయితే మద్య నిషేధం తర్వాత గ్రామస్తులంతా కలిసి జగదాంబదేవి ఆలయం నిర్మించుకున్నారు. మద్యనిషేధం తర్వాత పల్లెల్లో క్రమంగా పరిస్థితులు మెరుగయ్యాయి. గొడవలు తగ్గాయి. ఆత్మహత్యలు ఆగిపోయాయి. యువకులు కూడా చదువుపై శ్రద్ధ పెట్టారు. చదువు పూర్తయినవారు పనులు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. యువకులు గ్రామ శుభ్రత, అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఝరి(బి)లో శ్రమదానాలు జరిపి చెత్తను తొలగించారు. డ్వాక్రా సమూహాలు పర్యవేక్షణలో గ్రామాలు ప్రశాంతంగా ముందుకు సాగుతున్నాయి.

మద్య నిషేధ మాలలు..
మహారాష్ట్ర పర్భణి జిల్లాకు చెందిన శేషేరావ్‌ మహరాజ్‌ గ్రామాలకు వచ్చినప్పుడు మద్యం అలవాటు ఉన్నవారికి మద్య నిషేధ మాలలు వేస్తున్నారు. ఈ మాల వేసుకున్నవారు మద్యంతోపాటు మాంసం కూడా ముట్టరు. ఝరి(బి) గ్రామంలో చాలా మంది యువకులు మాల ధరించారు. దీంతో మద్యం, మాంసానికి దూరంగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారు.

భోజాబాయి ఝరి(బి) గ్రామానికి చెందిన ఈమె భర్త తాగుడుకు బానిసయ్యాడు. 14 ఏళ్ల క్రితం మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబం రోడ్డున పడింది. భోజాబాయి కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసింది. ఇలాగే ఈ గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో 12 ఏళ్ల క్రితం మద్య నిషేధం విధించారు.  

 ఉత్తం...హిప్నెల్లి తండాకు చెందిన ఇతను గ్రామంలో మద్యనిషేధం అమలులో కీలకపాత్ర పోషించాడు. యువకులు మద్యానికి బానిపై పనీపాట లేకుండా పెడదారి పడుతున్నట్లు గుర్తించాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి తలెత్తడంతో గ్రామంలో మద్య నిషేధం అమలుకు ఊరంతటినీ ఏకతాటిపైకి తెచ్చాడు. అందరూ మద్యనిషేధానికి అంగీకరించారు. దీంతో ఆరు నెలలుగా గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపేశారు.

తానూరు మండలం మొగ్లి గ్రామంలో రెండేళ్ల క్రితం మద్యం మత్తులో గ్రామస్తుడు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది. మద్యం కారణంగా యువత చెడుమార్గంలో పయనిస్తోందని గుర్తించారు. దీంతో గ్రామస్తులంతా ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించారు. మొగ్లి స్ఫూర్తితో సమీపంలోని మసల్గ తండావాసులు కూడా మద్య నిషేధం అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement