బెంగాల్‌లో భారీగా పోలింగ్‌ : ఎండ తీవ్రతకు నలుగురు మృతి | West Bengal Assembly Elections 2026, 70% Voter Turnout Recorded In First Phase And Four Voters Die Amid Heatwave | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో భారీగా పోలింగ్‌ : ఎండ తీవ్రతకు నలుగురు మృతి

Apr 23 2026 3:45 PM | Updated on Apr 23 2026 3:54 PM

West Bengal Assembly elections 2026 voters falls unconscious passed away

సాక్షి,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 మొదటి దశలో భాగంగా ఈరోజు (గురువారం) పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటa వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పశ్చిమ మేదినిపూర్ 65.77 శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది.  ఈ పోలింగ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓటు వేసే ప్రయత్నంలో తీవ్రమైన వేడి, శారీరక శ్రమ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ఓటర్లు మరణించారు. తూర్పు, పశ్చిమ మేదినీపూర్, మాల్దా, బీర్భూమ్ జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఏప్రిల్ మాసంలో తీవ్రమైన వేడి కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఈ నలుగురూ గుండెపోటుకు గురయ్యారు. 

పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, జరిగిన మరణాలు ఆనాటి కార్యకలాపాలపై నీడను పడేశాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నడుమ ఓటర్ల భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి.మృతులను తూర్పుమేదినీపూర్ జిల్లాలోని పటాష్‌పూర్‌కు చెందిన నృపేంద్ర దాస్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్‌పూర్‌కు చెందిన ఇస్రతన్ బీబీ, మాల్దా జిల్లాలోని మాలతీపూర్‌కు చెందిన ప్రమీలా బాగ్డి, బీర్భూమ్ జిల్లాలోని సూరికి చెందిన అసిమ్ రాయ్‌గా గుర్తించారు.

మాలతీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కందరన్ ప్రాంతంలో పోలింగ్ బూత్ వద్ద మహిళా ఓటరు స్పృహ కోల్పోయింది. కాసేపటికే ఆమె కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.  తన తల్లి, తన సోదరుడితో కలిసి ఓటు  వేయడానికి వెళ్లిందనీ, ఆమె ఓటు వేయబోతుండగా స్పృహ కోల్పోందని మృతురాలి కుమారుడు  సన్నీ తెలిపాడు.  ఆమె పోలింగ్ బూత్‌లోనే మరణించిందని కంట తడి పెట్టాడు. ఈ జిల్లాల్లో ఏప్రిల్ మధ్య నుంచి వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓటర్లు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ఉండాలని వైద్య నిపుణులు కూడా సూచించారు.

 > కాగా ఉత్తర బెంగాల్‌లోని 152 నియోజకవర్గాల్లో, రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని పలు జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 294 నియోజకవర్గాలలో 152 నియోజకవర్గాల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు వేయనున్నారు. కనీసం 80 స్థానాల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణపై చెలరేగిన రాజకీయ దుమారం , బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలన్న  ప్రతిపక్ష బీజేపీ వ్యూహాలు,తిరిగి అధికారం తమదే  అని చెబుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ   ఉత్కంఠగామారుతోంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement