సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ‘నయా హనీట్రాప్’ దందాపై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారులతో పాటు వారికి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇక, హానీట్రాప్ కేసులో లెడీడాన్ రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హానీట్రాప్ ముఠా.. మహిళను ఎరగా వేసి అమాయకుల నుంచి రెండు కోట్లు వసూలు చేసింది.
జిల్లాలో హానీట్రాప్ వెలుగులోకి తేవడంతో ఈ దందాపై ఎస్పీ జగదీష్ కొరడా ఝళిపించారు. కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. రాప్తాడు సీఐ శ్రీహర్షకు హనీ ముఠా సభ్యులతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదులో అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీరిద్దరినీ వీఆర్‌కు పంపుతూ బుధవారం డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకా కొందరు పోలీసులు ముఠా సభ్యులతో సన్నిహితంగా ఉండడంతోపాటు బాధితులను బెదిరించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. దాదాపు 10 మంది పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఠాలీడరుగా వ్యవ హరించిన రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఎస్పీపై భరోసాతో బాధితులు పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కుతూ ఫిర్యాదులు చేస్తున్నారు.

కవ్వించి.. కాటేస్తారు
ముఠా లీడర్లు.. సమాజంలో గౌరవంగా జీవిస్తున్న వ్యక్తుల కుటుంబం, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్టలను గమనించి, బలహీనతలను అంచనా వేస్తారు. తర్వాత కొందరి మహిళలను రంగంలోకి దింపి, ఫోన్ కాల్స్, చాట్‌లతో పరిచయం పెంచి, నమ్మకం కలిగిస్తారు. తర్వాత ఇంటికి పిలుస్తారు. ఏకాంత సమయంలో ముఠా సభ్యులు రంగప్రవేశం చేస్తారు. అప్పటికే బాధితుడిని న్యూడ్‌గా ఉండేలా చేస్తారు. ఆయన ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తారు. అక్కడితో ఆగకుండా కథకు కొత్త మలుపు ఇస్తారు. తర్వాత ‘నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం. నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపులు మొదలవుతాయి. దీంతో బాధి తులు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఇదే అదనుగా బాధితుడి స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తారు.


