Novak Djokovic: వ్యాక్సిన్‌కు ససేమిరా అంటున్న జకో.. మరో రెండు కీలక టోర్నీలకు దూరం

Novak Djokovic Pulls Out Of Indian Wells, Miami Open Over Covid Regulations - Sakshi

వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో టెన్నిస్‌ మాజీ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మొండి వైఖరి వీడటం లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఘోర అవమానం ఎదురైనా.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కోల్పోయినా అతని వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో వ్యాక్సిన్ వేసుకోని కారణంగా బహిష్కరణకు గురైనప్పటికీ.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తూ వ్యాక్సిన్‌కు ససేమిరా అంటున్నాడు జోకర్‌. 

ఇదే క్రమంలో తాజాగా మరో రెండు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. అమెరికా వేదికగా ఈ  నెలాకరున ప్రారంభంకానున్న  ఇండియన్ వెల్స్ టోర్నీతో పాటు మియామి టోర్నీల నుంచి అతను తప్పుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోని  విదేశీయులను తమ దేశంలోకి అనుమతించేది లేదని  అమెరికా స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో జకోవిచ్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో తనను బలవంతం చేస్తే, ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమేనంటూ ఈ మాజీ నంబర్‌ వన్‌ ఆటగాడు గతంలో స్పష్టం చేశాడు. 

ఇదిలా ఉంటే, ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచిన జకోవిచ్‌..  స్పానిష్‌ బుల్‌ రఫెల్ నదాల్ (21) తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. నదాల్‌ రికార్డును అధిగమించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని తెలిసినా, జకో ఏమాత్రం బెట్టు వీడటం లేదు. వ్యాక్సిన్‌ విషయంలో జకో వైఖరి ఇలానే కొనసాగితే జూన్‌లో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేది కూడా అనుమానమే. 
చదవండి: బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top