జొకోవిచ్‌ జోరు

Novak Djokovic has a 20th Grand Slam singles title in his sights - Sakshi

వరుస సెట్‌లలో విజయంతో మూడో రౌండ్‌లోకి వరల్డ్‌ నంబర్‌వన్‌

మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ కెనిన్, ఐదో సీడ్‌ ఆండ్రెస్కూ, తొమ్మిదో సీడ్‌ బెన్‌చిచ్‌ ఓటమి

లండన్‌: కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌పై గురి పెట్టిన వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఈ సెర్బియా స్టార్‌ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. 2018 రన్నరప్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6–3, 6–3, 6–3తో గెలుపొందాడు. గంటా 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా ఎదుర్కోలేదు. తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. నెట్‌ వద్దకు పదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచాడు. అండర్సన్‌ 26 అనవసర తప్పిదాలు చేయగా... జొకోవిచ్‌ ఆరు మాత్రమే చేశాడు.  

మరోవైపు 11వ సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌), 12వ సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌ (నార్వే) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. సామ్‌ క్వెరీ (అమెరికా) 7–6 (8/6), 6–4, 7–5తో కరెనో బుస్టాను... జోర్డాన్‌ థాంప్సన్‌ (ఆస్ట్రేలియా) 7–6 (8/6), 7–6 (7/3), 2–6, 2–6, 6–2తో రూడ్‌ను ఓడించారు.

సబలెంకా ముందంజ
మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) రెండో రౌండ్‌లో... ఐదో సీడ్‌ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), తొమ్మిదో సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) తొలి రౌండ్‌లో ఇంటిముఖం పట్టారు. రెండో రౌండ్‌లో సబలెంకా 4–6, 6–3, 6–3తో కేటీ బౌల్టర్‌ (బ్రిటన్‌)పై గెలిచింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో అలీజె కార్నె (ఫ్రాన్స్‌) 6–2, 6–1తో ఆండ్రెస్కూపై, కాయా యువాన్‌ (స్లొవేనియా) 6–3, 6–3తో బెన్‌చిచ్‌పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో మాడిసన్‌ బ్రెంగల్‌ (అమెరికా) 6–2, 6–4తో సోఫియా కెనిన్‌ను బోల్తా కొట్టించింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top