ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్‌

Novak Djokovic fends off Denis Kudla threat to reach pre-quarters - Sakshi

ముగురుజా ఓటమి

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

లండన్‌: ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ తన కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దిశగా ముందడుగు వేస్తున్నాడు.  వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో టాప్‌సీడ్‌ సెర్బియన్‌ స్టార్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో జొకోవిచ్‌ 6–4, 6–3, 7–6 (9/7)తో డెనిస్‌ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటలా 17 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లను జొకోవిచ్‌ అలవోకగానే కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మాత్రం క్వాలిఫయర్‌ కుడ్లా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.

ఈ సెట్‌లో తొలి మూడు గేమ్‌లను సొంతం చేసుకున్న కుడ్లా 3–0తో ఆధిక్యంలో నిలిచాడు. వెంటనే తేరుకున్న జొకోవిచ్‌ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి... అనంతరం తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 4–4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో సెట్‌ ‘టై బ్రేక్‌’కు దారి తీసింది. ఇక్కడ కూడా జొకోవిచ్‌ ఒక దశలో 1–4తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోర్‌ను 4–4 వద్ద సమం చేశాడు. ఇక ఇదే దూకుడులో ‘టై బ్రేక్‌’ను గెలిచిన జొకోవిచ్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

ముగిసిన టియాఫె పోరాటం
తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)కు షాకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఫ్రాన్సెస్‌ టియాఫె (అమెరికా) పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌లో టియాఫె 3–6, 4–6, 4–6తో కరెన్‌ కచనోవ్‌ (రష్యా) చేతిలో ఓడాడు. తొమ్మిదో సీడ్‌ డియాగో స్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)కు మూడో రౌండ్‌లో ఊహించని షాక్‌ తగిలింది. అతను 3–6, 3–6, 7–6 (8/6), 4–6తో అన్‌సీడెడ్‌ ఆటగాడు మార్టోన్‌ ఫుక్సోవిక్స్‌ (హంగేరి) చేతిలో ఓడాడు.

మాజీ చాంపియన్‌ ముగురుజా అవుట్‌
మహిళల సింగిల్స్‌లో 2017 వింబుల్డన్‌ చాంపియన్‌ ముగురుజా (స్పెయిన్‌)కు చుక్కెదురైంది. మూడో రౌండ్‌లో ముగురుజా 7–5, 3–6, 2–6తో ఓన్స్‌ జేబుర్‌ (ట్యూనీషియా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్‌ అరీనా సబలెంక (బెలారస్‌), ఏడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌), ఎనిమిదో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు.

రెండో రౌండ్‌లో సానియా–బోపన్న జంట
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో జరిగిన తొలి రౌండ్‌లో భారత ద్వయం సానియా మీర్జా– రోహన్‌ బోపన్న 6–2, 7–6 (7/5)తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌–అంకిత రైనా జంటపై గెలుపొంది రెండో రౌండ్‌లో ప్రవేశించింది. దివిజ్‌ శరణ్‌–సమంత శరణ్‌ (ఇంగ్లండ్‌) జోడీ 6–3, 5–7, 6–4 అరియల్‌ బెహెర్‌ (ఇజ్రాయెల్‌)–కలీనా ఒస్కబొయెవా (కజకిస్తాన్‌) జంటపై నెగ్గింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top