న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ (2026-27) రెన్యువల్ జాబితాను విడుదల చేసింది. కివీస్ సీనియర్ ఆటగాడు డెవాన్ కాన్వే సెంట్రల్ కాంట్రాక్ట్‌లో తిరిగి చోటు దక్కించుకున్నాడు. కొన్నేళ్లుగా టీ20 లీగ్స్‌లో బిజీగా గడుపుతూ వచ్చిన కాన్వే గత రెండేళ్లుగా కివీస్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఇటీవలే న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో కివీస్ బోర్డు తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను సవరించింది. ఈ నేపథ్యంలోనే విలియమ్సన్ స్థానంలో కాన్వేకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ కూడా సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్నాడు.
గతసారి కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన పలువురు ప్రముఖ ఆటగాళ్లను తాజా జాబితాలో చేర్చగా; అదే సమయంలో అందులో కొందరు మాత్రం తమను టెస్ట్ కాంట్రాక్టు జాబితాలో చేర్చవద్దని బోర్డును కోరినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని వారాల్లో ప్రకటించనున్న సాధారణ కాంట్రాక్ట్ లిస్టులో టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్‌తో పాటు జాక్ ఫోక్స్, మిచ్ హే కూడా చోటు దక్కించుకునే అవకాశముంది.
కివీస్‌కు మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాళ్లుగా ఉన్న మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, మాట్ హెన్రీలు సహా మిగతా క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ నేటి నుంచి ఓవల్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.
న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా:
టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్


