తొలి ప్రపంచ ‘యోగాసన’ చాంపియన్‌షిప్‌ షురూ | Narendra Modi virtually inaugurated the World Yogasana Championship | Sakshi
Sakshi News home page

తొలి ప్రపంచ ‘యోగాసన’ చాంపియన్‌షిప్‌ షురూ

Jun 5 2026 4:06 AM | Updated on Jun 5 2026 4:06 AM

Narendra Modi virtually inaugurated the World Yogasana Championship

వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ  

అహ్మదాబాద్‌: సమీప భవిష్యత్తులో ‘యోగాసన’ ప్రపంచ పోటీ క్రీడగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... ఇప్పుడు దేశంలో తొలి ప్రపంచ ‘యోగాసన’ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా గురువారం ఈ చాంపియన్‌షిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ‘సుదీర్ఘ కాలంగా వస్తున్న ప్రతీ సంప్రదాయం కాలంతో పాటు కొత్త దశలోకి మారుతుంది. ఈ ‘యోగాసన’ క్రీడల ప్రపంచ చాంపియన్‌షిప్‌ అటువంటి దశకు నాంది. దీని ద్వారా ‘యోగాసన’ ఒక పోటీ క్రీడగా గుర్తింపు పొందుతుంది. భవిష్యత్తులో ఒలింపిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో ‘యోగాసన’ చేరుతుందనే నమ్మకముంది’ అని అన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ నగరమైన అహ్మదాబాద్‌లో ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహించడం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. 

ఈ నెల 21 జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని ప్రధాని వెల్లడించారు. యోగాతో వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని మోదీ పునరుద్ఘాటించారు. పదేళ్ల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన భారత ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ‘ఆ సమయంలో ప్రపంచంలోని 190 దేశాలు భారత ప్రతిపాదననకు మద్దతు ఇచ్చాయి. నేడు కోట్లాది మంది ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకున్నారు. 

ధ్యానం, ప్రాణయామం వారి జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు అహ్లాదం సొంతం అవుతుంది. యోగాసన క్రీడలు విస్తరిస్తున్న కొద్ది ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. క్రీడాకారులతో పాటు యోగా శిక్షకులు,  పరిశోధకులు, ఈవెంట్‌ నిర్వాహకులు ఇలా చాలా మందికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి’ అని మోదీ గుర్తుచేశారు. ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement