IPL 2023: మరో కొత్త అవతారమెత్తనున్న బాలయ్య.. ఐపీఎల్‌ కామెంటేటర్‌గా..!

Nandamuri Balakrishna Teams Up With Star Sports Telugu For IPL 2023 - Sakshi

Nandamuri Balakrishna: నటసింహం బాలయ్య మరో కొత్త అవతారమెత్తనున్నాడు. సినిమాలు, రాజకీయాలు, ఓటీటీలో అన్‌స్టాపబుల్‌ షోతో  బిజీగా ఉండే బాలకృష్ణ.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2023 సీజన్‌తో వ్యాఖ్యాతగా మారనున్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు ఛానల్‌ ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ కోసం బాలయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కామెంట్రీ బాక్స్‌లో బాలయ్య.. వేణుగోపాల్‌ రావు, ఎంఎస్‌కే ప్రసాద్‌, ఆశిష్‌ రెడ్డి, కళ్యాణ్‌ కృష్ణ, టి సుమన్‌లతో కలిసి వ్యాఖ్యానించనున్నాడు. బాలయ్య తనదైన శైలిలో సినిమాకు, క్రికెట్‌ను అనుసంధానించి ఎలా వ్యాఖ్యానిస్తాడోనని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిన్నతనం నుంచి క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే బాలయ్య, కాలేజీ రోజుల్లో భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి క్రికెట్‌ ఆడేవారట. గతంలో బాలయ్య సినీ తారలు ఆడే సెలబ్రిటీ లీగ్‌లో తెలుగు వారియర్స్‌ జట్టుకు సారధ్యం వహించాడు. బాలయ్య సమయం దొరికినప్పుడల్లా సెట్స్‌లో కూడా క్రికెట్‌ ఆడేవారని జనాలు చెబుతుంటారు. ఇలా బాలయ్య ప్రతి దశలోనూ క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించాడు. క్రికెట్‌పై ఉన్న అమితాసక్తితోనే బాలయ్య స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు వారి ఆఫర్‌ను కాదనలేకపోయారని తెలుస్తోంది. 

కాగా, మార్చి 31న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌- ఫోర్‌ టైమ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top