RSWS 2022 Final IND-L Vs SL-L: సెంచరీతో చెలరేగిన నమన్‌ ఓజా.. ఇండియా లెజెండ్స్‌ భారీ స్కోరు

Naman Ojha Century India-Leg Set Big Target Sri-Lanka Leg RSWS-Final - Sakshi

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా శనివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఇండియా లెజెండ్స్‌ భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ నమన్‌ ఓజా సెంచరీతో (71 బంతుల్లో 108 నాటౌట్‌, 15 ఫోర్లు, 2 సిక్సర్లు)చెలరేగాడు. దీంతో ఇండియా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.  సెమీఫైనల్లో సెంచరీకి 10 పరుగుల దూరంలో ఆగిపోయిన నమన్‌ ఓజా.. ఈసారి మాత్రం అవకాశాన్ని మిస్‌ చేసుకోలేదు.

ఆరంభంలోనే సచిన్‌ టెండూల్కర్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగినప్పటికి.. సురేశ్‌ రైనా 4 పరుగులు చేసి ఔటైనప్పటికి.. ఒక ఎండ్‌లో మత్రం నమన్‌ ఓజా ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. నమన్‌ ఓజాకు జతగా వినయ్‌కుమార్‌(21 బంతుల్లో 36 పరుగులు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు.

వినయ్‌ కుమార్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ 13 బంతుల్లో 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ నమన్‌ ఓజా 68 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇండియా లెజెండ్స్‌ భారీ స్కోరు చేయడంలో నమన్‌ ఓజా కీలకపాత్ర పోషించాడు. లంక లెజెండ్స్‌ బౌలర్లలో నువాన్‌ కులశేఖర మూడు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా రెండు వికెట్లు, ఇషాన్‌ జయరత్నే ఒక వికెట్‌ తీసుకున్నాడు.

చదవండి: థర్డ్‌ అంపైర్ చీటింగ్‌.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top