సుధామూర్తితో కలిసి డాక్టరేట్‌ అందుకున్న నైనా | Sakshi
Sakshi News home page

సుధామూర్తితో కలిసి డాక్టరేట్‌ అందుకున్న నైనా

Published Thu, Feb 1 2024 5:09 PM

Naina Jaiswal Receive Doctorate With Sudha Murthy Form Adi Kavi Nannaya University - Sakshi

భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌, చదువుల తల్లిగా పేరొందిన నైనా జైస్వాల్ డాక్టరేట్‌ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవం సందర్భంగా.. గవర్నర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ నైనాకు పీహెచ్‌డీ డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తికి కూడా గౌరవ డాక్టరేట్‌ అందించారు. కాగా అత్యంత పిన్న వయసులోనే పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్న తొలి భారతీయ వ్యక్తిగా నైనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 22 ఏళ్ల వయసులోనే ఈ హైదరాబాదీ ఈ ఫీట్‌ నమోదు చేశారు.


కుటుంబంతో నైనా జైస్వాల్‌

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్‌ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్‌ పరిశోధన చేశారు. ఈ క్రమంలో పీహెచ్‌డీ పట్టా అందుకుని రికార్డు సాధించారు. కాగా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన  నైనా జైస్వాల్‌.. చదువులోనూ మేటి.

ఎనిమిదేళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్‌, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. తద్వారా ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో మోటివేషనల్‌ స్పీకర్‌గా రాణిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement