ముంబై మెరిసె... నిరీక్షణ ముగిసె... | Mumbai Indians start the 19th season with a win | Sakshi
Sakshi News home page

ముంబై మెరిసె... నిరీక్షణ ముగిసె...

Mar 30 2026 2:50 AM | Updated on Mar 30 2026 2:51 AM

Mumbai Indians start the 19th season with a win

2012 తర్వాత ఐపీఎల్‌లో తమ తొలి పోరులో విజయం

దంచికొట్టిన రోహిత్, రికెల్టన్‌ 

6 వికెట్ల తేడాతో కోల్‌కతా పరాజయం 

రహానే మెరుపులు వృథా  

గత 13 సీజన్‌లుగా ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయిన ముంబై ఇండియన్స్‌... ఎట్టకేలకు ఆ అడ్డంకిని అధిగమించింది. 2012 తర్వాత తొలిసారి ముంబై జట్టు విజయంతో ఐపీఎల్‌ సీజన్‌ను ప్రారంభించింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన పోరులో బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల దూకుడు తోడవడంతో ముంబై ఘనవిజయం సాధించింది.

‘లోకల్‌ బాయ్‌’ శార్దుల్‌ ఠాకూర్‌ చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగా... బ్యాటింగ్‌లో రోహిత్, రికెల్టన్‌ మెరుపులతో హార్దిక్‌ పాండ్యా బృందం గెలుపు బోణీ కొట్టింది. తాజా సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 200కు మించి స్కోరు చేసినా... దానిని కాపాడుకోవడంలో విఫలమైంది.    

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌ను ముంబై ఇండియన్స్‌ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. పచ్చికతో కనిపించిన పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుందనుకుంటే... వాంఖడేలో ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. 

అజింక్య రహానే (40 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా... అంగ్‌క్రిష్‌ రఘువంశీ (29 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక అర్ధశతకం చేశాడు. ఫిన్‌ అలెన్‌ (17 బంతుల్లో 37; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (33 నాటౌట్‌; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 39 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో విజృంభించారు. ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో ముంబైకిదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం.  

10 ఓవర్లలో 120... 
అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కింది. తొలి రెండు ఓవర్లలో 14 పరుగులు రాగా... మూడో ఓవర్‌ నుంచి మోత మొదలైంది. గజన్‌ఫర్‌ బౌలింగ్‌లో అలెన్‌ 4, 6, 6తో విజృంభించాడు. ఇక హార్దిక్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో రహానే, అలెన్‌ దంచికొట్టారు. తొలి రెండు బంతులకు రహానే సిక్స్‌లు బాదితే... చివరి మూడు బంతులకు అలెన్‌ ఫోర్లు కొట్టాడు. దీంతో 26 పరుగులు వచ్చాయి. ఫలితంగా 4 ఓవర్లు ముగిసేసరికి నైట్‌రైడర్స్‌ 57 పరుగులు రాబట్టింది. 

తదుపరి ఓవర్‌లో రెండు ఫోర్లు రాగా... చేంజ్‌ బౌలర్‌గా వచ్చిన శార్దుల్‌ ఈ జోడీని విడదీశాడు. అయినా రహానే నిలకడగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 120/2తో నిలిచింది. ఆ తర్వాత ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనమైంది. ముంబై కుర్రాడు అంగ్‌క్రిష్‌ రఘువంశీ చక్కటి షాట్‌లు ఆడినా... వైస్‌ కెప్టెన్‌ రింకూ సింగ్‌ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతో చివరి 10 ఓవర్లలో కోల్‌కతా 100 పరుగులకు పరిమితమైంది.  

శార్దుల్‌ ‘లక్కీ హ్యాండ్‌’ 
2015 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్న శార్దుల్‌ ఠాకూర్‌ ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత... ఈ సీజన్‌లో ముంబై గూటికి చేరాడు. దేశవాళీల్లో ముంబై జట్టుకు సారథ్యం వహించే శార్దుల్‌... ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. తన తొలి ఓవర్‌లోనే ప్రమాదకర అలెన్‌ను వెనక్కి పంపిన అతడు... రెండో ఓవర్‌లో గ్రీన్‌ (18; 1 ఫోర్, 1 సిక్స్‌)ను బుట్టలో వేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న రహానేను సైతం అతడే అవుట్‌ చేసి కోల్‌కతా మరింత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు.  

అలవోకగా... 
ఐపీఎల్‌లో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, రికెల్టన్‌ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్‌లో 4, 6, 4తో రఫ్ఫాడించిన రోహిత్‌... కార్తీక్‌ త్యాగీ ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లతో 23 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఐపీఎల్‌లో ‘హిట్‌మ్యాన్‌’కు ఇదే వేగవంతమైన అర్ధశతకం. మరో ఎండ్‌లో రికెల్టన్‌ కూడా దూకుడు కనబర్చడంతో పవర్‌ప్లేలో ముంబై 88 పరుగులు చేసింది. ఈ క్రమంలో రికెల్టన్‌ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ఖాతాలో వేసుకున్నాడు. తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 148 పరుగులు చేశాక రోహిత్‌ అవుట్‌ కాగా... ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (16; 3 ఫోర్లు) ప్రభావం చూపలేకపోయాడు. రికెల్టన్‌ దురదృష్టవశాత్తు రనౌట్‌ కాగా... తిలక్‌ వర్మ (20; 4 ఫోర్లు), కెప్టెన్‌ హార్దిక్‌ (18 నాటౌట్‌; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయడంతో ముంబై మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.

కెప్టెన్‌ కామెంట్‌
చాలా ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం సాధించాం. 13 ఏళ్ల అనంతరం సీజన్‌ ఆరంభ పోరులో గెలవడం ఆనందంగా ఉంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా అనిపించింది. 220 లక్ష్యం పెద్దదేం కాదు. అందుకు తగ్గట్లే రోహిత్, రికెల్టన్‌ ఆరంభం నుంచే దూకుడు కనబర్చారు. శార్దుల్‌ ఠాకూర్‌ నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఇక అతడి కెరీర్‌ ముగిసే వరకు ముంబై ఇండియన్స్‌తోనే ఉంటాడు. –హార్దిక్‌ పాండ్యా, ముంబై కెప్టెన్‌  

221 ఐపీఎల్‌లో ముంబైకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. 2021లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై చేజ్‌ చేసిన 219 పరుగుల లక్ష్యం రెండో స్థానానికి చేరింది. 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకిది ఆరోసారి. పంజాబ్‌ కింగ్స్‌ ఎనిమిదిసార్లు ఈ ఘనత సాధించింది.

గ్రీన్‌ విఫలం 
ఐపీఎల్‌ 19వ సీజన్‌ వేలంలో భారీ ధర (రూ. 25.20 కోట్లు) పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 18 పరుగులే చేసిన అతడు... బౌలింగ్‌లో ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు.  

» 2024 టి20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ట్రోఫీ అందించిన తర్వాత ఆడిన ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా దర్శనమివ్వగా... ఇప్పుడు తాజా టి20 ప్రపంచకప్‌ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దిగాడు.  

» దక్షిణాఫ్రికా స్టార్‌ క్వింటన్‌ డికాక్‌ను కాదని... అదే దేశానికి చెందిన ర్యాన్‌ రికెల్టన్‌కు ముంబై తుది జట్టులో చోటు కల్పించగా... అతడు ఐపీఎల్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరుతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

» కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లేయర్లు ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌), ముజరబాని (జింబాబ్వే)తో పాటు ముంబై ఇండియన్స్‌ ఆటగాడు గజన్‌ఫర్‌ (అఫ్గానిస్తాన్‌) ఈ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశారు.  

»  ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథి అజింక్య రహానే కండరాలు పట్టేయడంతో నాలుగో ఓవర్‌లో అతడు మైదానాన్ని వీడాడు. మిగతా మ్యాచ్‌లో రింకూ సింగ్‌ జట్టుకు నాయకత్వం వహించాడు.  

1161 ఐపీఎల్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ (కోల్‌కతాపై 1161 పరుగులు) గుర్తింపు పొందాడు. విరాట్‌ కోహ్లి (పంజాబ్‌ కింగ్స్‌పై 1159 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. 

190 ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ప్లేయర్‌గా సునీల్‌ నరైన్‌ గుర్తింపు పొందాడు. కీరన్‌ పొలార్డ్‌ (189 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును నరైన్‌ సవరించాడు.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) హార్దిక్‌ (బి) శార్దుల్‌ 67; అలెన్‌ (సి) తిలక్‌ (బి) శార్దుల్‌ 37; గ్రీన్‌ (సి) రూథర్‌ఫోర్డ్‌ (బి) శార్దుల్‌ 18; రఘువంశీ (సి) తిలక్‌ (బి) హార్దిక్‌ 51; రింకూ (నాటౌట్‌) 33; రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–69, 2–109, 3–145, 4–205. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–38–0; హార్దిక్‌ 3–0–39–1; గజన్‌ఫర్‌ 4–0–51–0; బుమ్రా 4–0–35–0; శార్దుల్‌ 4–0–39–3; మార్కండే 1–0–16–0.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (రనౌట్‌) 81; రోహిత్‌ (సి) అనుకూల్‌ (బి) అరోరా 78; సూర్యకుమార్‌ (సి) రింకూ (బి) కార్తీక్‌ 16; తిలక్‌ (సి) (సబ్‌) మనీశ్‌ (బి) నరైన్‌ 20; హార్దిక్‌ (నాటౌట్‌) 18; నమన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–148, 2–179, 3–184, 4–215. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–52–1; ముజరబాని 3–0–34–0; వరుణ్‌ చక్రవర్తి 4–0–48–0; కార్తీక్‌ త్యాగి 4–0–43–1; నరైన్‌ 3–0–30–1; అనుకూల్‌ రాయ్‌ 1.1–0–15–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement