శతక్కొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌ | Most Matches As Captain In IPL: Shreyas Iyer Joins Rohit Sharma, MS Dhoni | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌

May 17 2026 5:21 PM | Updated on May 17 2026 5:50 PM

Most Matches As Captain In IPL: Shreyas Iyer Joins Rohit Sharma, MS Dhoni

ఐపీఎల్‌లో కెప్టెన్సీ అంటే ఒత్తిడి, అంచనాలు, విమర్శలు కలగలిసిన బాధ్యత. ఒక్క తప్పిదం మ్యాచ్‌నే కాదు, కెప్టెన్‌ ప్రతిష్టనూ ప్రభావితం చేస్తుంది. ఇలాంటి హైప్రెషర్‌ లీగ్‌లో దీర్ఘకాలం జట్టును నడిపించడం చాలా కొద్దిమందికే సాధ్యమైంది. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చేరాడు. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, గౌతమ్‌ గంభీర్‌ సరసన నిలిచాడు.

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ధోని. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను తొలి సీజన్‌ నుంచే నడిపించిన అతను ఐపీఎల్‌లో మొత్తం 235 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో సీఎస్‌కే ఐదు టైటిళ్లు గెలుచుకుని లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. కెప్టెన్‌గా 136 విజయాలు సాధించిన ధోనికి 57.87 విజయశాతం ఉంది.

రెండో స్థానంలో రోహిత్‌ శర్మ ఉన్నాడు. 2013లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ చేపట్టిన రోహిత్‌, అదే ఏడాది జట్టుకు తొలి టైటిల్‌ అందించాడు. తర్వాత మరో నాలుగు సార్లు ట్రోఫీ గెలిపించి ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 158 మ్యాచ్‌ల్లో జట్టును నడిపిన అతను 87 విజయాలు సాధించాడు.

మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ నిలిచాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొమ్మిదేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ, టైటిల్‌ గెలవలేకపోయినా జట్టును పలుమార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అతని నాయకత్వంలో ఆర్సీబీ 2016లో ఫైనల్‌ చేరింది. మొత్తం 143 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ 66 విజయాలు సాధించాడు.

కేకేఆర్‌కు రెండు టైటిళ్లు అందించిన గౌతమ్‌ గంభీర్‌ 129 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బలమైన జట్టుగా మారి ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి శ్రేయస్‌ అయ్యర్‌ కూడా చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కెప్టెన్సీ ప్రయాణం ప్రారంభించిన అయ్యర్‌, ఆ జట్టును 2020లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారి ఆ జట్టుకు టైటిల్‌ అందించాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ను నడిపిస్తున్న అతను 100 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 54 విజయాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 17) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement