'లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయాలా'.. రిజ్వాన్‌ అదిరిపోయే రిప్లై | Sakshi
Sakshi News home page

IND Vs PAK T20 WC 2022: 'లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయాలా'.. భారత అభిమానికి రిజ్వాన్‌ అదిరిపోయే రిప్లై

Published Wed, Oct 19 2022 9:32 AM

Mohammad Rizwan Hilarious Response Indian Fan Bowling Request Viral - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ మ్యాచ్‌ గెలిచింది అంటే ఆ మ్యాచ్‌లో రిజ్వాన్‌ మెరిసి ఉంటాడనేలా అభిమానుల్లో పాతుకుపోయింది. పాక్‌ జట్టుకు రిజ్వానే బలం.. బలహీనత. అతను ఆడని రోజున పాకిస్తాన్‌ పూర్తిగా విఫలం కావడం గమనించాం. దీంతో రిజ్వాన్‌ పాకిస్తాన్‌ బ్యాటింగ్‌కు వెన్నుముకలా మారిపోయాడు. మహ్మద్‌ రిజ్వాన్‌కు తోడుగా కెప్టెన్‌ బాబర్‌ ఆజం కూడా రాణించడం సానుకూలాంశం. ఈ ఇద్దరు విఫలమైతే పాక్‌ కష్టాల్లో పడినట్లే.

టీమిండియాతో తలపడేందుకు పాకిస్తాన్‌ సిద్ధమవుతుంది. అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌ వేదికగా జరగనున్న బ్లాక్‌బాస్టర్‌ మ్యాచ్‌ కోసం అభిమానులతో పాటు ఇరు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసింది మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజంలు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈసారి కూడా ఎలాగైనా టీమిండియాతో మ్యాచ్‌లో రాణించాలని రిజ్వాన్‌ పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే అతని ప్రాక్టీస్‌ కొనసాగుతుంది.

ఈ విషయం పక్కనబెడితే.. రిజ్వాన్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు పాక్‌ ఓపెనర్‌ ఇచ్చిన సమాధానం క్రికెట్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. రిజ్వాన్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఒక భారత అభిమాని అతని దగ్గరకు వచ్చి.. నేను నీకు లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయాలా అని అడిగాడు. మొదట రిజ్వాన్‌ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ సదరు వ్యక్తి మరోసారి అదే ప్రశ్న వేయడంతో స్పందించిన రిజ్వాన్‌.. పెషావర్‌కు వచ్చి బౌలింగ్‌ చెయ్యు అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. దీంతో భారత అభిమాని నవ్వుల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఐసీసీ మేజర్‌ టోర్నీల్లో(వన్డే వరల్డ్‌కప్‌, టి20 ప్రపంచకప్‌) పాకిస్తాన్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్‌లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్‌ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 

చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం

'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం'

Advertisement
Advertisement