'అలా అయితే 2023 వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం'.. బీసీసీఐకు పీసీబీ అల్టిమేటం!

Pakistan Threatens World Cup Pullout After Jay Shah Announcement - Sakshi

Asia Cup 2023- India Vs Pakistan: చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా కాలమైపోయింది. రాజకీయ వ్యవహారాల కారణంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేవు. అందుకే ఐసీసీ మేజర్‌ టోర్నీల్లోనే టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడుతూ వస్తున్నాయి.

ఈసారి టి20 ప్రపంచకప్‌లోనూ అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. మ్యాచ్ సంగతి పక్కనబెడితే.. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాకిస్థాన్‌ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్‌-2023లో భారత్‌ జట్టు పాల్గొనబోదని కుండబద్దలు కొట్టాడు.  

కాగా జై షా వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది టీమిండియా ఆసియా కప్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ రాకపోతే.. అదే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ 2023 బాయ్‌కాట్‌ చేయాలని పీసీబీకి సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఏసీసీ(ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌) నుంచి కూడా తప్పుకోవాలనే యోచనలో పీసీబీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక పీసీబీ కూడా జై షా వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. టి20 వరల్డ్‌కప్‌ ముగిసిన అనంతరం మెల్‌బోర్న్‌లో జరగనున్న ఐసీసీ సభ్య సమావేశంలో జై షా చేసిన వ్యాఖ్యలను దృష్టికి తీసుకువస్తామని పీసీబీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.  

ఇక వన్డే వరల్డ్‌కప్‌ 2023కి భారత్‌ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఏసీసీ అధ్యక్ష హోదాలో ఉండి ఒక దేశం తరఫునే మాట్లాడటం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు. బీసీసీఐ తమ పలుకుబడి చూపిస్తోందని.. పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను తొక్కెయ్యాలనుకుంటుందని పేర్కొన్నారు. వన్డే వరల్డ్‌కప్‌ బాయ్‌కాట్‌ చేస్తే బీసీసీఐ, ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుందని.. పాకిస్థాన్ లేకుండా టోర్నీని ఎలా నిర్వహిస్తారో చూద్దామని కామెంట్‌ చేశారు.

వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ను చేయడం ద్వారా బీసీసీఐకి వచ్చే నష్టం ఏం లేదని.. అది పీసీబీకే ఎసరు తెస్తుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ బాయ్‌కట్ చేస్తే.. పీసీబీపై ఐసీసీ కన్నెర్ర చేస్తుందని, బ్లాక్ లిస్ట్‌లో పెట్టి ఇచ్చే నిధులను ఆపేస్తుందని చెబుతున్నారు. తద్వారా పీసీబీకే నష్టం వాటిల్లుతుందని, ఈ వ్యవహారంపై ఆచితూచి అడుగెయ్యాలని హెచ్చరించారు. 

చదవండి: ఆసియా కప్‌ టోర్నీలో ఆడలేం: జై షా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top