ఆసియా కప్‌ టోర్నీలో ఆడలేం: జై షా

Wont go to Pakistan for Asia cup: BCCI Secretary Jay Shah - Sakshi

‘దాదా’ వారసుడిగా ఏకగ్రీవ ఎన్నిక

పోటీలేని కొత్త కార్యవర్గం  

ముంబై: మరోసారి మరో మాజీ క్రికెటరే బోర్డు పాలకుడయ్యారు. తొలి వన్డే ప్రపంచకప్‌ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్‌ బిన్నీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్‌ వేసిన వాళ్లందరికీ దక్కాయి.

అయితే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ అభ్యర్థిపై ఎలాంటి చర్చ లేకుండానే బోర్డు ఏజీఎం పదవుల పంపకంతోనే ముగిసింది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా మహిళల ఐపీఎల్‌ను ఆమోదించడం ఒక్కటే జరిగింది. ‘ఐసీసీకి వెళ్లే బోర్డు ప్రతినిధిపై, ఐసీసీ చైర్మన్‌గిరిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఎజెండాలోని అంశాలే ఏజీఎంలో చర్చించారు’ అని ఓ రాష్ట్ర సంఘం సభ్యుడొకరు తెలిపారు. 

కొత్త కార్యవర్గం: రోజర్‌ బిన్నీ (అధ్యక్షుడు), జై షా (కార్యదర్శి), రాజీవ్‌ శుక్లా (ఉపాధ్యక్షుడు), దేవ్‌జిత్‌ సైకియా (సంయుక్త కార్యదర్శి), ఆశిష్‌ షెలార్‌ (కోశాధికారి). 

ఐపీఎల్‌ చైర్మన్‌గా ధుమాల్‌ 
గంగూలీ నేతృత్వంలోని బోర్డులో ఇన్నాళ్లూ కోశాధికారిగా పనిచేసిన అరుణ్‌ ధుమాల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బ్రిజేశ్‌ పటేల్‌ స్థానంలో ఆయన్ని నియమించారు. ఎమ్‌కేజే మజుందార్‌ను బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధిగా ఎన్నుకున్నారు.

అమ్మాయిల ఐపీఎల్‌కు జై 
బోర్డు ఏజీఎంలో ఐపీఎల్‌ తరహా అమ్మాయిల లీగ్‌కు ఆమోదం లభించింది. వచ్చే ఏడాది మార్చిలో ఐదు జట్లతో మహిళల ఐపీఎల్‌ జరుగుతుంది. అయితే జట్లను ఎలా విక్రయించాలి, టోర్నీని ఏ విధంగా నిర్వహించాలనే అంశాలను కొత్త గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.  

ఏటా రూ. వేల కోట్లు పెరుగుదల 
ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) నగదు నిల్వలు ఏటికేడు వేల కోట్లు పెరిగిపోతున్నాయి. మూడేళ్ల క్రితం పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో ఉన్నపుడు రూ. 3,648 కోట్లుగా ఉన్న బోర్డు కోశాగారం ఇప్పుడు రూ. 9,629 కోట్లకు చేరింది. కేవలం మూడేళ్లలోనే రూ. 5,981 కోట్లు పెరిగాయి. దాదాపు 3 రెట్లు ఆదాయం పెరిగింది. అలాగే రాష్ట్ర సంఘాలకు వితరణ కూడా ఐదు రెట్లు పెంచారు. సీఓఏ జమానాలో రూ. 680 కోట్లు ఇస్తుండగా... ఇప్పుడది రూ.3,295 కోట్లకు పెరిగిందని  కోశాధికారి పదవి నుంచి దిగిపోతున్న అరుణ్‌ ధుమాల్‌ ఏజీఎంలో ఖాతాపద్దులు వివరించారు.  

పాక్‌లో ఆడేదిలేదు 
వచ్చే ఏడాది పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్‌ టోర్నీలో ఆడలేమని బోర్డు కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు ముందు వన్డే ఫార్మాట్‌లో ఆసియా ఈవెంట్‌ పాకిస్తాన్‌లో నిర్వహించనున్నారు. దీనిపై ఏజీఎంలో చర్చించిన నూతన కార్యవర్గం తటస్థ వేదికపైనే ఆడేందుకు మొగ్గు చూపింది. అనంతరం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడైన జై షా బోర్డు నిర్ణయాన్ని వెలువరించారు. తటస్థ వేదికపై అయితేనే ఆసియా కప్‌ ఆడతామన్నారు. ఈ ఏడాది టి20 ఫార్మాట్‌లో శ్రీలంకలో జరగాల్సిన ఆసియా ఈవెంట్‌ సింహళ దేశం దివాళా కారణంగా యూఏఈలో నిర్వహించారు.  పాక్‌లో జరిగే ఆసియాకప్‌లో టీమిండియా ఆడకపోతే... వచ్చే ఏడాది భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ కూడా ఆడబోదని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 

క్రికెటర్ల గాయాలపై దృష్టి పెడతాం. 
ఆటగాళ్లు తరచూ గాయాలపాలయ్యే పరిస్థితుల్ని తగ్గిస్తాం. దీనికోసం అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలించి, పరిస్థితిని మెరుగుపరుస్తాం. బెంగళూరు అకాడమీ (ఎన్‌సీఏ)లో డాక్టర్లు, ఫిజియోల బృందం ఈ పనిలో నిమగ్నమవుతాయి. దేశవాళీ పిచ్‌లను పోటీతత్వంతో ఉండేలా తీర్చిదిద్దుతాం. ఆస్ట్రేలియాలాంటి దేశాలకు దీటుగా పిచ్‌లను తయారు చేస్తాం. –రోజర్‌ బిన్నీ  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top