
పుణె: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు టీమిండియా ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అభిమానుల ఆగ్రహానికి గురికావడం ఇటీవల పరిపాటిగా మారింది. టెస్టు సిరీస్ నేపథ్యంలో చెన్నై, అహ్మదాబాద్ పిచ్‌పై వాన్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, భారత జట్టు ఓడిన ప్రతిసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. రెండో వన్డేలో భారత్ ఓడిపోగానే, కోహ్లి కెప్టెన్సీని విమర్శించాడు. ఇక తాజాగా, ఆఖరి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు క్యాచ్‌లు జారవిడిచిన తీరుపై మరోసారి సెటైర్లు వేశాడు. ‘‘అమ్మో నాకు భయం వేస్తోంది. భారత జట్టు కోసం ఈవారంలో మళ్లీ నా ఫీల్డింగ్ అకాడమీ తెరవాలేమో’’ అని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించాడు.
దీంతో, టీమిండియా అభిమానులు వాన్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘‘ముందు నీ జట్టును జాగ్రత్తగా ఇంటికి బయల్దేరమని చెప్పు. ఇంకో విషయం.. మా వాళ్ల గురించి నీకేం బెంగ అక్కర్లేదు. ముందుకు మీ ఇంగ్లండ్ క్రికెటర్లకు నీ అకాడమీలో అడ్మిషన్లు ఇవ్వు. ఎందుకంటే, పేరుకు ప్రపంచ చాంపియన్.. అయినా సిరీస్‌ను చేజార్చుకున్నారు. మూడు ఫార్మాట్లలో కనీసం ఒక్కటైనా గెలిచారు. పైగా మా జట్టు గురించి మాట్లాడుతున్నావా’’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మూడో వన్డేలో గెలుపుపై కోహ్లి సేన ధీమాగా ఉన్న సమయంలో ఫీల్డర్లు పలు క్యాచ్‌లు జారవిడిచిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్ పాండ్యా, సామ్ కరన్ ఇచ్చిన క్యాచ్‌ను నటరాజన్ డ్రాప్ చేశారు. అయితే, అదే సమయంలో.. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్‌ను మలుపుతిప్పాయి. స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను ధావన్(పదకొండో ఓవర్‌లో), ఆదిల్ రషీద్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి ఒడిసిపట్టిన విధానం ముచ్చటగొలిపింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆటలో కొన్ని తప్పిదాలు సహజమని, వాటిని భూతద్దంలో చూడటమే తప్ప, అద్భుతంగా రాణించిన విధానాన్ని ప్రశంసించలేవా అంటూ అభిమానులు వాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
చదవండి: ఆ క్యాచ్ హైలెట్.. ఒకవేళ అవి జారవిడవకుండా ఉంటే..!
ధోని లేకపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నాడు: వాన్
I am afraid my fielding academy is open again this week for all the Indian Team !!! 😜😜😜 #INDvENG
— Michael Vaughan (@MichaelVaughan) March 28, 2021