Martin Guptill: రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు.. కివీస్‌ తరపున తొలి ఆటగాడిగా

Martin Guptill Surpass Rohit Sharma Become Leading Run Scorer T20 Cricket - Sakshi

న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్‌ 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ(3379 పరుగులు) రికార్డును బద్దలు కొట్టి 3399 పరుగులతో టాప్‌ స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మ 128 మ్యాచ్‌ల్లో 3379 పరుగులు చేయగా.. ఇందులో నాలుగు సెంచరీలు, 26 అర్థసెంచరీలు సాధించాడు. ఇక మార్టిన్‌ గప్టిల్‌ 116 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 20 అర్థ సెంచరీలతో 3399 పరుగులు సాధించాడు.

అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో రోహిత్‌ ఉండగా.. మూడో స్థానంలో టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి(3308 పరుగులు), ఐర్లాండ్‌కు చెందిన పాల్‌ స్టిర్లింగ్‌(2894 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(2855 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా కివీస్‌ తరపున టి20ల్లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌. ఇంతకముందు మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(2140 పరుగులు) మాత్రమే ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే స్కాట్లాండ్‌పై కివీస్‌ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ‍బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫిన్‌ అలెన్‌(56 బంతుల్లో 101, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం చేయగా.. గప్టిల్‌ 40, నీషమ్‌ 30 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కాట్లాండ్‌ బ్యాటర్స్‌లో గాలమ్‌ మెక్‌లీడ్‌ 33,  క్రిస్‌ గ్రీవ్స్‌ 31 పరుగులు చేశారు.

చదవండి: Shubman Gill: సెంచరీ మిస్‌ అయినా దిగ్గజాల సరసన చోటు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top