బెంగాల్‌లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్‌ దిగ్గజం | Leander Paes Joins BJP Under Kiran Rijuju Ahead Bengal Assembly Elections | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్‌ దిగ్గజం

Mar 31 2026 2:03 PM | Updated on Mar 31 2026 2:22 PM

Leander Paes Joins BJP Under Kiran Rijuju Ahead Bengal Assembly Elections

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పేస్‌ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్‌కతాలో లియాండర్‌ పేస్‌ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో బ్రెజిల్‌కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్‌ నిలిచారు.

ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో సింగిల్స్‌ కంటే డబుల్స్‌పై దృష్టి సారించిన పేస్‌ పురుషుల గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో డబుల్స్‌లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్‌డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 

బెంగాల్‌ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement