PSL 2023: ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్‌; టైటిల్‌ నిలబెట్టుకున్న లాహోర్‌

Lahore Qalandars Won By 1 Run Vs Multan Sultans Clinch PSL 2023 Title - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) 8వ సీజన్‌ విజేతగా లాహోర్‌ ఖలండర్స్‌ నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన షాహిన్‌ అఫ్రిది సేన వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను నిలబెట్టుకుంది. అప్పుడు కూడా ఫైనల్‌ ముల్తాన్‌ సుల్తాన్స్‌తో ఆడడం విశేషం.

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లాహోర్‌ ఖలండర్స్‌ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన దశలో జమాన్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి బంతిని కుష్‌దిల్‌ షా మిడాన్‌ దిశగా ఆడాడు. రెండు పరుగులు పూర్తి చేసిన కుష్‌దిల్‌ షా మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న డేవిడ్‌ వీస్‌ అఫ్రిదికి త్రో వేశాడు. వేగంగా అందుకున్న బంతిని అఫ్రిది క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లకు గిరాటేశాడు. అంతే ముల్తాన్‌ సుల్తాన్స్‌ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచింది. ఓడినా ముల్తాన్‌ సుల్తాన్స్‌ తన ప్రదర్శనతో అభిమానుల మనసులను గెలుచుకుంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ ఖలండర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. షఫీకి 40 బంతుల్లో 65 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ షాహిన్‌ అఫ్రిది 15 బంతుల్లో 2ఫోర్లు, 5 సిక్సర్లతో 44 పరుగులు నాటౌట్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడగా.. ఫఖర్‌ జమాన్‌ 39 పరుగులు చేశాడు. ముల్తాన్‌ సుల్తాన్స్‌ బౌలింగ్‌లో ఉస్మా మీర్‌ మూడు వికెట్లు తీయగా.. అన్వర్‌ అలీ, ఇషానుల్లా, కుష్‌దిల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ వికెట​ఉల పడుతున్న లక్ష్యం దిశగా సాగుతూ వచ్చింది. రిలీ రొసౌ(32 బంతుల్లో 52, 7ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. మహ్మద్‌ రిజ్వాన్‌ 34, టిమ్‌ డేవిడ్‌ 20, కుష్‌దిల్‌ షా 25 పరుగులు చేశారు. లాహోర్‌ ఖలండర్స్‌ బౌలింగ్‌లో షాహిన్‌ అఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగగా.. రషీద్‌ ఖాన్‌ రెండు, డేవిడ్‌ వీస్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తన ప్రదర్శనతో అదరగొట్టిన షాహిన్‌ అఫ్రిది ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. ఇషానుల్లా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

చదవండి: బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top