ICC WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వికెట్ల వెనుక మనోడే

KS Bharat automatic choice for WTC final - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ప్రపంచ టెస్ట్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) టైటిల్‌ పోరులో భారత్‌ జట్టు వికెట్‌ కీపర్‌గా విశాఖకు చెందిన కె.ఎస్‌.భరత్‌ ఎంపికయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో తొలిసారిగా టెస్ట్‌ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ఈ 30 ఏళ్ల కీపర్‌ బ్యాటర్‌ బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్‌లు ఆడాడు. ఇవన్నీ భారత్‌లోనే జరిగాయి. కానీ విదేశీ గడ్డపై జరగనున్న ఈ చాంపియన్‌ప్‌లో ఆడేందుకు సెకండ్‌ ఫ్రంట్‌లైన్‌ వికెట్‌కీపర్‌గా ఉన్న భరత్‌కు అనూహ్యంగా అవకాశం అందివచ్చింది. పంత్‌ గాయపడి అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ మంగళవారం ప్రకటించిన భారత్‌ 15వ మెంబర్‌ స్క్వాడ్‌లో వికెట్‌కీపర్‌గా అవకాశం దక్కింది.

అయితే జట్టులో మరో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కె.ఎల్‌.రాహుల్‌ ఉన్నా.. వికెట్ల వెనుక భరతే నిలిచే అవకాశాలు ఉన్నాయి. లండన్‌లో జూన్‌ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే టైటిల్‌ పోరులో ఆ్రస్టేలియాతో భారత్‌ తలపడనుంది.  భారత్‌ వేదికగా బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. మొదటి టెస్ట్‌లో భరత్‌ తొలి స్టంపౌట్‌గా లబుషేన్‌ను వెనక్కి పంపాడు. సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల్లో తొలి టెస్ట్‌లో ఓ స్టంపౌట్, ఓ క్యాచ్‌ పట్టిన భరత్‌.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు క్యాచ్‌లు పట్టాడు. నాలుగో టెస్ట్‌లో 44 పరుగుల కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌తో మొత్తంగా 101 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 67, ఏడో స్థానంలో వచ్చి 26, ఎనిమిదో స్థానంలో వచ్చి 8 పరుగులు చేశాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top