IND VS SA: కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత

Kohli Becomes First Indian Batter To Complete 1000 Runs In T20 World Cup - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 12 పరుగులకే ఔటైనా అతని ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కోహ్లి 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉండగా.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో 1000 పరుగుల మార్కును చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి టీ20 వరల్డ్‌కప్‌ల్లో 22 ఇన్నింగ్స్‌లు ఆడి 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో కోహ్లి 28 పరుగులు చేసి ఉంటే.. శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే వాడు. జయవర్ధనే టీ20 వరల్డ్‌కప్‌ల్లో 31 మ్యాచ్‌లు ఆడి 1016 పరుగులు చేశాడు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చారిత్రక ఇన్నింగ్స్‌ (82 నాటౌట్‌) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు.

కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లి సహా టాపార్డర్‌ మొత్తం విఫలం కావడంతో టీమిండియా 49 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, సూర్యకుమార్‌ మరోసారి ఆపద్బాంధవుడిలా ఆదుకుని జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సూర్య.. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 115/6గా ఉంది. 
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top