
భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) మరో జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) జట్టు యూపీ వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. యూపీ వారియర్స్ జట్టు సీఓఓ క్షేమల్ వేంగన్‌కర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
మాకెంతో ప్రత్యేకం
‘‘అభిషేక్ నాయర్ మా జట్టుకు హెడ్ కోచ్‌గా రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆయన కోచ్‌గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిన తర్వాత.. మరో మాటకు తావులేకుండా మేము ఒప్పందం చేసుకున్నాం.
ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్ది.. వారిలో విజయకాంక్షను రగిల్చే అతి కొద్ది మంది కోచ్‌లలో అభిషేక్ ఒకరు. అతడి అనుభవం మాకు ఉపయోగపడుతుంది. గత పద్దెనిమిది నెలల కాలంలోనే మూడు జట్లు చాంపియన్‌గా నిలవడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.
అభిషేక్ యూపీ వారియర్స్‌తో చేరడం మాకు ఎంతో ఎంతో ప్రత్యేకం’’ అని క్షేమల్ వేంగన్‌కర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోకు వెల్లడించాడు. కాగా 2018లో అభిషేక్ నాయర్ కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ సహాయక సిబ్బందిగా చేరాడు. ఇక 2022లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ట్రింబాగో నైట్ రైడర్స్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు.
కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర
ఇక.. 2024లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌గా తన వంతు పాత్ర నిర్వర్తించాడు. ఈ క్రమంలో నాటి కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అతడి సహాయక సిబ్బందిలో అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు.
టీమిండియా విధుల నుంచి తప్పించారు
అయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టులలో టీమిండియా 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌ను 3-1తో చేజార్చుకోవడంతో నాయర్‌పై బీసీసీఐ వేటు వేసింది. 2025 జనవరిలో అతడిని అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది.
ఈ క్రమంలో మళ్లీ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా తిరిగి వచ్చిన 41 ఏళ్ల అభిషేక్ నాయర్.. ముంబై టీ20 లీగ్-2025లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్‌కు మెంటార్‌గానూ వ్యవహరించాడు. తాజాగా డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.
చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్‌బై!?