‘ట్రిపుల్‌ సెంచరీ’ హీరోకు కరోనా!

Kings XI Punjab Batsman Karun Nair Recovers From Covid 19 - Sakshi

న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ కరోనా వైరస్‌ బారిన పడిన  విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు వారాల క్రితం కరుణ్‌ నాయర్‌.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్‌ నాయర్‌ సెల్ఫ్‌ హెమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉన్న నాయర్‌కు నాలుగు రోజుల క్రితం జరిపిన కోవిడ్‌-19 పరీక్షల్లో కోలుకున్నట్లు సమాచారం. గత నెల్లో చేతన్‌ చౌహాన్‌ కరోనా బారిన పడగా, ఆపై కరోనా వైరస్‌ సోకిన క్రికెటర్‌ కరుణ్‌ నాయర్‌ కావడం గమనార్హం.(ఒకటో నంబర్‌ హెచ్చరిక...)

ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కరుణ్‌ నాయర్‌ కింగ్స్‌ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మళ్లీ భారత జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నాయర్‌.. ఐపీఎల్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. వచ్చే నెల 19వ తేదీ నుంచి జరుగనున్న ఐపీఎల్‌ జరగడానికి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ రాగా, ఈ నెల 20వ తేదీ తర్వాత అన్ని ఫ్రాంచైజీలు యూఏఈకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో కరోనా కేసులు వెలుగు చూడటం సవాల్‌ మారింది. మొత్తం బయో సెక్యూర్‌ పద్ధతిలో జరిగే ఐపీఎల్‌-2020.. ముందుగా క్రికెటర్లకు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ధోని కూడా కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత యూఏఈకి బయల్దేరనున్నాడు. కాగా, కరుణ్‌ నాయర్‌కి ముందుగా కరోనా వచ్చి తగ్గిపోవడం కాస్త ఊరట కల్గించే అంశమే.  కరుణ్‌ నాయర్‌కు కరోనా సోకిన విషయాన్ని గోప్యంగా ఉంచడంతో అది వెలుగులోకి రాలేదు.  కాగా, 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తర్వాత భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నాయర్ చరిత్ర సృష్టించాడు.  ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కరుణ్‌ తన మూడో టెస్టులోనే రికార్డు నెలకొల్పడం విశేషం.  అదే సమయంలో తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చిన ఏకైక భారత ఆటగాడిగా గుర్తింపు పొందడం విశేషం.(ఈసారి హెలికాప్టర్‌ షాట్లతో పాపులర్‌..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top