ఉత్కంఠ పోరు.. చివరి బంతికి గెలిచారు

Kings Punjab Beat RCB By 8 Wicktes - Sakshi

షార్జా: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్‌ పంజాబ్‌కు గేల్‌ ఓ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన మార్కు స్టైల్‌ ఆటతో పంజాబ్‌ ఊపిరి తీసుకునే విజయాన్ని అందించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన గేల్‌ తర్వాత సిక్స్‌లతో మంచి జోష్‌ తీసుకొచ్చాడు. 45 బంతుల్లో   1 ఫోర్‌, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్‌ తన విలువ ఏమిటో చూపించాడు. అతనికి జతగా కేఎల్‌ రాహుల్‌(61 నాటౌట్‌;  49 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు) మరోసారి రాణించడంతో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించింది. కింగ్స్‌పంజాబ్‌ జట్టులో మయాంక్‌ అగర్వాల్‌(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు.

ఆ తర్వాత గేల్‌, రాహుల్‌లు ఓ సొగసైన ఇన్నింగ్స్‌ ఆడారు. కాగా, చహల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్‌ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్‌ రనౌట్‌ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. కానీ పూరన్‌ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఫినిష్‌ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌కు విజయం దక్కింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌కు మాత్రమే వికెట్‌ లభించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కింగ్స్‌ పంజాబ్‌దే పైచేయి అయ్యింది. ఇది పంజాబ్‌కు రెండో విజయం కాగా, ఆర్సీబీకి మూడో ఓటమి.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. అరోన్‌ ఫించ్‌(20), దేవదూత్‌ పడిక్కల్‌(18)లు నిరాశపరిచారు. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఫించ్‌ ఔట్‌ కాగా, అర్షదీప్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ ఏడు ఓవర్లలోపే పెవిలియన్‌కు వెళ్లారు. ఆ తరుణంలో కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆదిలోనే ఆర్సీబీ వికెట్లను చేజార్చుకోవడంతో కోహ్లి మరో మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లి(48; 39 బంతుల్లో 3ఫోర్లు) జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. అతనికి జతగా శివం దూబే(23; 19 బంతుల్లో 2 సిక్స్‌)లు కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ ఏబీ డివిలియర్స్‌(2) విఫలం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది.

డివిలియర్స్‌ ఐదో వికెట్‌గా ఔటైన కాసేపటికే కోహ్లి ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో కోహ్లి ఔటయ్యాడు. దాంతో హాఫ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోహ్లి చేజార్చుకున్నాడు. షమీ బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ ముగిసింది. చివర్‌లో క్రిస్‌ మోరిస్‌(25 నాటౌట్‌;  8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించాడు. షమీ వేసిన ఆఖరి ఓవర్‌లో క్రిస్‌ మోరిస్‌ 1 ఫోర్‌, రెండు సిక్స్‌లు కొట్టగా, ఉదానా ఒక సిక్స్‌ కొట్టాడు. చివరి ఓవర్‌లో ఆర్సీబీ 24 పరుగులు పిండుకుంది. దాంతో ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మిగతా ఆర్సీబీ ఆటగాళ్లలో వాషింగ్టన్‌ సుందర్‌(13), ఉదాన(10 నాటౌట్‌; 1సిక్స్‌)లు ఫర్వాలేదనిపించారు. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌లు తలో  రెండు వికెట్లు సాధించగా, అర్షదీప్‌ సింగ్‌, క్రిస్‌ జోర్డాన్‌లు చెరో వికెట్‌ తీశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top