Arjun Tendulkar: తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా!

Kapil Dev BIG Statement On-Arjun Tendulkar Prove 50 Percent-Your Father - Sakshi

అర్జున్‌ టెండూల్కర్‌.. భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప క్రికెటర్‌గా రాణిస్తాడని అంతా భావించారు. కానీ ప్రతీ ఇంట్లో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. తండ్రి ఎంత పెద్ద క్రికెటర్‌ అయినా.. తనలో స్కిల్‌ ఉంటేనే ఎవరి కొడుకైనా గొప్ప క్రికెటర్‌ అవుతాడు. తాజాగా అర్జున్‌ టెండూల్కర్‌కు సంబంధించి ఒక విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఐపీఎల్‌ 2022లో అర్జున్‌ టెండూల్కర్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రూ. 30 లక్షలతో కొనుగోలు చేసిన ముంబై అతనికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం కల్పించలేదు.

కేవలం ఒక గొప్ప క్రికెటర్‌ తనయుడు కావడం.. ముంబై ఇండియన్స్‌తో తండ్రికున్న అనుబంధం అతన్ని జట్టులోకి తీసుకునేలా చేసింది. ఇది ఒక పరిది వరకు బాగానే ఉంటుంది.. అవకాశాలు ఇవ్వకుండా జట్టుతో అట్టిపెట్టుకొని తిరిగితే ఏంటి లాభమని క్రికెట్‌ ఫ్యాన్స్‌ విమర్శలు కురిపించారు. ఇక ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌.. ''అర్జున్‌ బౌలింగ్‌లో ఇంకా చాలా మెళుకువలు నేర్చుకోవాలి.. ఇప్పుడు అతనిలో ఉన్న స్కిల్స్‌ ఏ మాత్రం సరిపోవు.'' అని కామెంట్‌ చేశాడు. అర్జున్‌ టెండూల్కర్‌ విషయంలో నిజంగా దురదృష్టమే.. ఎందుకంటే తనతో సమానమైన.. తనకంటే తక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఇరగదీస్తున్నారు. ''ఎంతైనా అవకాశమిస్తేనే కదా అతనిలో లోపాలు ఉన్నాయా లేదా అనేది తెలిసేది'' అంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. 

ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజం.. మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అర్జున్‌ టెండూల్కర్‌ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''అర్జున్‌లో టెండూల్కర్‌ గురించి అంతా మాట్లాడుతున్నారు.. ఎందుకంటే అతను దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు కాబట్టి. అయితే అతన్ని అంతా సచిన్‌తో పోలుస్తున్నారు. అలా కాకుండా అర్జున్‌ను తన ఆటను ఆడనిస్తే మంచిది. అతనికి ఇంకా 22 ఏళ్లు మాత్రమే. ఒక క్రికెటర్‌గా రాణించడానికి ఇదే సరైన సమయం. తండ్రిలా అద్బుతాలు చేయకపోవచ్చు.. కానీ ఒక మంచి క్రికెటర్‌గా పేరు సంపాదించే అవకాశం ఉంటుంది.

అర్జున్‌లో ఉన్న టెండూల్కర్‌.. పేరు చాలా ఇబ్బంది పెడుతుంది. నిజానికి టెండూల్కర్‌ అనే పేరు అర్జున్‌ను వెలుగులోకి రానీయడం లేదు.. అంతేకాదు ఆ పేరు అతన్ని ట్రోల్‌ చేయడంతో పాటు అవమానాలు ఎదుర్కొనేలా చేస్తుంది. అతని ఆట అతనే ఆడాలి. కొత్తగా ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక లెజెండరీ ఆటగాడి కుమారుడిగా అతను కనీసం 50 శాతమైనా నిరూపించుకోవాలి. అలా జరగాలంటే అర్జున్‌.. ముందు తన పేరులో ఉన్న ''టెండూల్కర్‌'' పదాన్ని తొలగించుకోవాలి. దిగ్గజ ఆటగాడు సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ కుమారుడు.. బ్రాడ్‌మన్‌ అనే పదాన్ని తన పేరు నుంచి తొలగించుకున్నాడు. ఎందుకంటే ప్రతీ ఒక్కరు అతన్ని తండ్రితో పోల్చడమే ఇందుకు కారణమంట. అనవసరంగా అర్జున్‌పై ఒత్తిడి పెంచొద్దు.'' అని పేర్కొన్నాడు.

చదవండి: Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్‌ బాండ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top