క్రికెట్‌ చరిత్రలో ఈ రోజు: వన్డేల్లో అత్యధిక స్కోర్‌ నమోదు

On June 8th 2018 New Zealand Women Team Created History In ODI - Sakshi

వన్డే క్రికెట్‌ చరిత్రలో జూన్‌ 8కి ఓ ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇవాల్టి రోజున న్యూజిలాండ్‌ మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోర్‌(490/4) నమోదు చేసి చరిత్ర సృష్టించింది. సహజంగా అత్యధిక స్కోర్‌ అనగానే పురుషుల క్రికెట్‌లోనే నమోదైవుంటుందని సగటు క్రికెట్‌ అభిమాని ఊహిస్తాడు. కానీ, పురుష క్రికెటర్లకు సైతం సాధ్యం కాని ఈ అద్భుతమైన రికార్డును కివీస్‌ మహిళా జట్టు ఆవిష్కరించింది. ఇప్పటివరకు పురుషుల క్రికెట్‌లో(ఆస్ట్రేలియాపై 2018లో 481/6) కాని మహిళా క్రికెట్‌లో కాని ఇదే అత్యుత్తమ స్కోర్‌గా కొనసాగుతుండటం విశేషం. 

వివరాల్లోకి వెళితే.. 2018 జూన్‌ 8న న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య డబ్లిన్‌ వేదికగా జరిగిన వన్డే పోరులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పర్యాటక కివీస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు సాధించింది. కివీస్‌ జట్టులో ఓపెనర్ సుజీ బేట్స్(94 బంతుల్లో 151; 24 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌ డౌన్‌ ప్లేయర్‌ మ్యాడీ గ్రీన్‌(77 బంతుల్లో 121; 15 ఫోర్లు, సిక్స్‌) అద్భుత శతకాలతో చెలరేగగా ఆఖర్లో అమేలియా కెర్‌(45 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేసింది. 

మరో ఓపెనర్‌ జెస్‌ వాట్కిన్‌ (59 బంతుల్లో 62; 10 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీతో రాణించింది. దీంతో న్యూజిలాండ్‌ జట్టు వన్డేల్లో చారిత్రక స్కోర్‌ నమోదు చేసింది. అనంతరం 491 పరుగుల అతి భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో ఆతిధ్య ఐర్లాండ్‌ జట్టు 35.3 ఓవర్లలో 144 పరుగలకే చాపచుట్టేసింది. ఐర్లాండ్‌ జట్టులో కెప్టెన్ లారా డెలానీ అత్యధికంగా 37 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ 347 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
చదవండి: పొట్టి క్రికెట్‌లో పెను విధ్వంసం.. 28 బంతుల్లోనే శతకం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top