
13 ఏళ్ల తర్వాత స్వదేశీ కోచ్
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు చాన్నాళ్ల తర్వాత స్వదేశీ కోచ్‌ను నియమించారు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) భారత్‌కు చెందిన ఖాలిద్ జమీల్‌కు జాతీయ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. ఈ కోచ్ పదవి కోసం విదేశీ కోచ్‌లు స్టీఫెన్ కాన్‌స్టంటైన్, స్టీఫాన్ టర్కోవిచ్‌లు కూడా పోటీపడినప్పటికీ వీళ్లిద్దరిని వెనక్కినెట్టిన 48 ఏళ్ల జమీల్ భారత్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. 13 ఏళ్ల తర్వాత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశీ కోచ్ శిక్షణ ఇవ్వనున్నారు.
చివరి సారిగా భారత్‌కే చెందిన సావియో మెడెరా 2011 నుంచి 2012 వరకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. తాజా నియామకంపై ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ ‘ఐఎమ్ విజయన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ ముగ్గురితో కూడిన తుదిజాబితా నుంచి జమీల్‌ను ఎంపిక చేసింది. అయితే ఆయన పదవీ కాలాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. జమీల్ మూడేళ్ల గడువును ఆశిస్తున్నారు. అయితే రెండేళ్లా లేదంటే మూడేళ్లా అనేది జట్టు ప్రదర్శన, ఆయన ఇచ్చే శిక్షణను బట్టి ఉంటుంది’ అని అన్నారు.
భారత మాజీ ఫుట్‌బాలర్ అయిన జమీల్ శిక్షణలో 2017లో ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్ ‘ఐ–లీగ్’ టైటిల్‌ను సాధించింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కోచ్‌గా ఉన్నారు. అయితే భారత కోచ్‌గా నియమితులైన జమీల్ పూర్తి స్థాయిలో టీమిండియా కోచ్‌గా పనిచేయాల్సి ఉంటుందని ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు చౌబే స్పష్టం చేశారు. దీంతో ఐఎస్‌ఎల్ ఫ్రాంచైజీకి జమీల్ గుడ్‌బై చెప్పాల్సి ఉంది.
గత కోచ్ మారŠె భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉంటూనే, ఎఫ్‌సీ గోవా కోచ్‌గాను పనిచేశారు. స్పెయిన్‌కు చెందిన మనోలో గత నెల కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. టీమిండియా గత కొంతకాలంగా తక్కువ ర్యాంకు జట్లతోనూ ఓడిపోతుండటంతో ఇంకో ఏడాది పదవీకాలం మిగిలిండగానే కోచ్ తన పదవికి రాజీనామా చేశారు.