మరో ఆరు స్థానాలు పడిపోయిన భారత ఫుట్‌బాల్ జట్టు
‘ఫిఫా’ ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న భారత ఫుట్‌బాల్ జట్టు ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత వెనుకబడింది. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో 0–1 గోల్స్ తేడాతో ఓడిన టీమిండియా ఆరు స్థానాలు కోల్పోయి 142వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఆసియా కప్‌నకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన భారత జట్టుకు గత తొమ్మిదేళ్లలో ఇదే చెత్త ర్యాంక్.
చివరిసారిగా 2016 అక్టోబర్‌లో 148వ ర్యాంక్‌లో నిలిచిన భారత్ జట్టుకు ఆ తర్వాత ఇదే అత్యధిక ర్యాంక్. 2023 డిసెంబర్‌లో 102వ స్థానంలో ఉన్న టీమిండియా... వరుస పరాజయాల కారణంగా 40 స్థానాలు దిగజారింది. ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత్ 27వ ర్యాంక్‌లో ఉంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి టీమిండియా అత్యుత్తమంగా 1996లో 94వ స్థానం దక్కించుకుంది.
ర్యాన్ విలియమ్స్‌కు అనుమతి
ఆ్రస్టేలియా ఆటగాడు ర్యాన్ విలియమ్స్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ‘ఫిఫా’ అంగీకారం తెలిపింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ర్యాన్ విలియమ్స్ ఇటీవల ఆసీస్ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. దీంతో అతడు భారత జట్టు సెలెక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు.
ఈ మేరకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) వివరాలు వెల్లడించింది. 32 ఏళ్ల ర్యాన్ ఆ్రస్టేలియా పాస్‌పోర్ట్ అప్పగించి భారత పౌరసత్వం పొందాడు. విలియమ్స్ తల్లి ముంబైలో జన్మించడంతో అతడికి ముందు నుంచే భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉంది. మరిప్పుడు జాతీయ జట్టు తరఫున అతడికి అవకాశం దక్కుతుందా చూడాలి.
‘ర్యాన్ విలియమ్స్‌కు సంబంధించిన అసోసియేషన్ మార్పు అభ్యర్థనను ఫిఫా ఆమోదించింది. దీంతో ర్యాన్ భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి అధికారికంగా అర్హత పొందాడు’ అని ఏఐఎఫ్‌ఎఫ్ వెల్లడించింది. ఆ్రస్టేలియా అండర్–20, అండర్–23 జట్లకు ప్రాతినిధ్యం వహించిన ర్యాన్... సీనియర్ టీమ్ తరఫున దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. ఇంగ్లిష్ క్లబ్‌లు ఫుల్హామ్, పోర్ట్స్‌మౌత్ తరఫున కూడా ర్యాన్ మ్యాచ్‌లు ఆడాడు.


