ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా!

James Vince Opens Up After Andrew Tye Wide Controversy In BBL - Sakshi

కాన్‌బెర్రా: బిగ్‌బాష్‌ లీగ్‌లో శనివారం పెర్త్‌ స్కార్చర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్‌ బ్యాట్స్‌మన్‌ జేమ్స్‌ విన్స్‌ 98* పరుగులతో వీరవిహారం చేసి ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే విన్స్‌ సెంచరీ మిస్‌ కావడానికి పెర్త్‌ స్కార్చర్స్‌ బౌలర్‌ ఆండ్రూ టై పరోక్ష కారణమయ్యాడు. వాస్తవానికి సిడ్నీ జట్టుకు చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో విన్స్‌ 98 పరుగులతో ఉన్నాడు. విజయానికి ఒక పరుగు దూరం.. అతని సెంచరీకి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆండ్రూ టై కావాలని చేశాడో.. యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కాని అతను వేసిన బంతి వైడ్‌ వెళ్లింది. దీంతో సిడ్నీ సిక్సర్స్‌ పరుగు అవసరం లేకుండా ఎక్స్‌ట్రా రూపంలో‌ విజయం సాధించినా... విన్స్‌కు మాత్రం నిరాశ మిగిలింది.

ఆండ్రూ టై చేసిన పనిపై సోషల్‌ మీడియాలో విపరీతమైన కామెంట్స్‌ వచ్చాయి. 'ఎలాగో మ్యాచ్‌ ఓడిపోతారని తెలుసు.. విన్స్‌ను సెంచరీ చేయిస్తే బాగుండేది.. ఆండ్రూ టై కావాలనే ఇదంతా చేశాడు' అంటూ కామెంట్స్‌ రాసుకొచ్చారు. ఆండ్రూ టై చేసిన పనిపై విన్స్‌ స్పందించాడు. ఆండ్రూ టై కావాలనే ఆ పని చేశాడా అనేది అతనికి తెలియాలి. నేను సెంచరీ మిస్‌ అయినందుకు బాదేం లేదు.. ఎందుకంటే జట్టును ఫైనల్‌ చేర్చాననే సంతోషం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. అప్పటికి అతను వేసిన బంతిని టచ్‌ చేసేందుకు ప్రయత్నించాను. కానీ బ్యాట్‌కు దూరంగా బంతి వైడ్‌ రూపంలో వెళ్లింది. ఒక బౌలర్‌గా ఆలోచించిన టై.. అతని బౌలింగ్‌లో సెంచరీ చేసే అవకాశం ఇవ్వకూడదనే అలా చేశాడు. ఈ విషయంలో ఆండ్రూ టైది కూడా తప్పు అనలేం. అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: వైరల్‌: బాబు ఈ కొత్త షాట్‌ పేరేంటో

కాగా ఆండ్రూ టై చర్యపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విన్స్‌ సెంచరీ కాకుండా వైడ్‌ వేయాలని ఆండ్రూ టై దగ్గరకు ఎవరు వచ్చి చెప్పలేదు.. కావాలనే అతను బంతిని వైడ్‌ వేశాడు. నిజంగా టై నుంచి ఇలాంటిది ఆశించలేదు. అంటూ విరుచుకుపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో  మొదట బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కార్చర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్‌ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ టర్నర్‌ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్‌ ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్‌లో జేమ్స్‌ విన్స్‌ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14  ఫోర్లు, ఒక సిక్సర్‌తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్‌ జోష్‌ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అంపైర్‌ను తిట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top