46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్‌ హీరోయిన్‌

Jack Hobbs Oldest Batter To Score Test Century Kissed By Famous Actress - Sakshi

టెస్టుల్లో ఒక బ్యాట్స్‌మన్‌ సెంచరీ సాధించడం గొప్పగా భావిస్తారు. వన్డేలు, టి20లు రాకముందు టెస్టు మ్యాచ్‌లే అసలైన క్రికెట్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలుత ఆరు రోజుల పాటు నిర్వహించిన టెస్టు మ్యాచ్‌లను క్రమంగా ఐదు రోజులకు కుదించారు. ఐదు రోజులపాటు జరగాల్సిన మ్యాచ్‌లు ఇటీవలే మూడు, నాలుగు రోజుల్లోనే ఎక్కువగా ముగుస్తున్నాయి. ఇక టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీ సాధిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది.

కానీ ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. తాజాగా పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ బాది ఆ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా నిలిచాడు. మరి లేటు వయసులో టెస్టు సెంచరీ అందుకొని.. ఒక నటి చేత ముద్దుల వర్షం అందుకున్న క్రికెటర్‌ కూడా ఒకరు ఉన్నారు. ఆ క్రికెటర్‌ ఎవరో తెలుసా.. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌టైమ్ గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ హాబ్స్‌​. ఈ తరానికి జాక్‌ హాబ్స్‌ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 19వ దశకంలో క్రికెట్‌ ఇష్టపడిన వారికి జాకబ్‌ హాబ్స్‌ పేరు సుపరిచితం. 

ఇంగ్లండ్‌ తరపున 1908-1930 మధ్య 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. 61 టెస్టుల్లో 5410 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యంత లేటు వయసులో(46 ఏళ్ల 82 రోజులు) టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా జాక్‌ హాబ్స్‌ ఇప్పటికి తొలి స్థానంలో ఉన్నాడు. 1929లో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన చివరి టెస్టులో జాక్‌ హాబ్స్‌ ఒక ఇన్నింగ్స్‌లో 142 పరుగులు సాధించాడు. 46 ఏళ్ల వయసులో సెంచరీ అందుకున్న తొలి క్రికెటర్‌గా స్థానం జాక్‌ హాబ్స్‌ నిలిచాడు.

కాగా 1963లో కన్నుమూసిన జాక్‌ హాబ్స్‌ 1935లో మై లైఫ్‌ స్టోరీ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. ఆ పుస్తకంలో తాను లేటు వయసులో సెంచరీ సాధించిన రోజు ఒక ఇంగ్లీష్‌ ఫేమస్‌ నటి ముద్దుల్లో ముంచిందని పేర్కొన్నాడు. ''మెల్‌బోర్న్‌​ టెస్టులో 142 పరుగులు చేసిన నేను.. ఆరోజు సాయంత్రం చిన్న పార్టీ ఇచ్చారు. హోటల్‌ డైనింగ్‌ రూమ్‌కు అడుగుపెట్టిన నాకు అందరు అభినందనలు చెప్పారు. కానీ ఒకావిడ మాత్రం నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టింది. ఈ పరిణామం ఆశ్చర్యపరిచినప్పటికి.. ఇదో రకమైన కృతజ్థత అనుకున్నా. కానీ ఆ నటి ఎవరో నేను ఇప్పడు చెప్పలేను'' అంటూ రాసుకొచ్చాడు.

అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు న్యూ సౌత్‌వేల్స్‌ అనే వార్తా పత్రిక జాక్‌ హాబ్స్‌ను ముద్దుపెట్టిన నటి పేరును బయటకు వెల్లడించింది. కెనడాకు చెందిన మార్గరెట్‌ బానర్‌మన్‌ అనే ఫేమస్‌ ఆర్టిస్ట్‌.. హాబ్స్‌కు ముద్దు పెట్టిందంటూ హెడ్‌లైన్స్‌ రాసుకొచ్చింది. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఈ దెబ్బకు మార్గరెట్‌ పేరు మార్మోగిపోయింది. 1896లో టొరంటోలో జన్మించిన బానర్‌మన్‌ కొన్నేళ్ల పాటు ఇంగ్లీష్‌ సినిమాల్లో నటించింది. మంచి నటిగా పేరున్న  మార్గరెట్‌ బానర్‌మన్‌ 1976లో 79 ఏళ్ల వయసులో మరణించింది. 


ఇక లేటు వయసులో టెస్టుల్లో సెంచరీ సాధించిన జాబితాలో జాక్‌ హాబ్స్‌ తొలి స్థానంలో ఉండగా.. పాస్టీ ఎండ్రెన్‌( ఇంగ్లండ్‌, 45 ఏళ్ల 151 రోజులు), వారెన్‌ బార్డ్‌స్లే(ఆస్ట్రేలియా, 43 ఏళ్ల 202 రోజులు), డేవ్‌ నోర్సీ(సౌతాఫ్రికా, 42 ఏళ్ల 291 రోజులు), ఫ్రాంక్‌ వూలీ( ఇంగ్లండ్‌, 42 ఏళ్ల 61 రోజులు), మిస్బా ఉల్‌ హక్‌( పాకిస్తాన్‌, 42 ఏళ్ల 47 రోజులు) వరుసగా ఉన్నారు.

చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్‌కేకు బిగ్‌షాక్‌.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్‌ ఆటగాడు దూరం!

Anirban Lahiri: భారత క్రీడల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ కొట్టేశాడు..

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top