రోహిత్‌ శర్మ ఇకపై టెస్టు కెప్టెన్‌ మాత్రమే! | Its Better If It Doesnt Happen In Our Culture: Irfan Pathan on Separate Captains | Sakshi
Sakshi News home page

టీమిండియాలో అలాంటి సంప్రదాయం వద్దు.. రోహిత్‌ ఇకపై కేవలం: ఇర్ఫాన్‌ పఠాన్‌

Dec 3 2023 1:56 PM | Updated on Dec 3 2023 3:32 PM

Its Better If It Doesnt Happen In Our Culture: Irfan Pathan on Separate Captains - Sakshi

టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు ఉండటం పట్ల తనకు సదభిప్రాయం లేదని మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. పని ఒత్తిడిని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అయినా.. భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించలేమన్నాడు.

దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో జట్ల ఎంపిక విధానం చూస్తే.. రోహిత్‌ శర్మను ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా చూసే అవకాశం లేదని ఇర్ఫాన్‌ అభిప్రాయపడ్డాడు. అతడు కేవలం టెస్టులకు పరిమితం అవుతాడని పేర్కొన్నాడు.

కాగా సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా.. టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ప్రకటించిన బీసీసీఐ.. టీ20 పగ్గాలను సూర్యకుమార్‌ యాదవ్‌, వన్డే కెప్టెన్సీని కేఎల్‌ రాహుల్‌కు అప్పగించింది. ఇక రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌ పూర్తిగా దూరం కానున్నాడనే వార్తకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా తరచూ టీమిండియా కెప్టెన్లు మారుతూ (తాత్కాలికంగా)ఉండటంపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘భవిష్యత్తులో ఈ సంప్రదాయం కొనసాగే అవకాశం ఉంది. అయితే, నాకు ఇలాంటి పరిణామం పెద్దగా ఇష్టం లేదు.

భారత జట్టుకు ఒక్కో ఫార్మాట్‌లో ఒక్కో కెప్టెన్‌ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పని ఒత్తిడి భారాన్ని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజం. 

అందుకే సౌతాఫ్రికా పర్యటనకు మూడు వేర్వేరు జట్లు, ముగ్గురు కెప్టెన్లను నియమించారు. దీనిని బట్టి రోహిత్‌ శర్మ ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కనిపించడని స్పష్టమైంది. అతడిని టెస్టు జట్టు కెప్టెన్‌గా మాత్రమే చూడగలం.

భవిష్యత్తులో ఇది వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి సంప్రదాయం మన జట్టులో కొనసాగకూడదనే అనుకుంటున్నా’’ అని జియో సినిమా షోలో ఇర్ఫాన్‌ పఠాన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వేర్వేరు కెప్టెన్లు, వేర్వేరు కోచ్‌లు ఉండటం దీర్ఘకాలంలో పెద్దగా ప్రయోజనాలు చేకూర్చదని అభిప్రాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement