
లండన్: ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ‘హండ్రెడ్’ లీగ్‌లోని ఎనిమిది జట్లలో వాటాల అమ్మకం దాదాపుగా పూర్తయింది. ఆరు జట్లకు సంబంధించి ఒప్పందాలు అధికారికంగా ఖాయం అయ్యాయని, మరో రెండు జట్ల విషయంలో చర్చలు తుది దశలో ఉన్నాయని ఈసీబీ ప్రకటించింది.
ఈ రెండు జట్లకు సంబంధించి కూడా కొన్ని చిన్న సాంకేతిక అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలోనే ఇది కూడా పూర్తవుతుందని బోర్డు వెల్లడించింది. ఈ ఎనిమిది టీమ్‌లలో నాలుగు టీమ్‌లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జట్లు ఉన్న యాజమాన్యాలే సొంతం చేసుకోవడం విశేషం.
టి20 క్రికెట్ నుంచి స్వల్ప మార్పులతో 100 బంతులు ఆడే విధంగా 2021లో ప్రారంభమైన ‘హండ్రెడ్’ లీగ్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటూ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు నేరుగా ఈసీబీ ఈ టోర్నీఎనిమిది జట్ల నిర్వహణను పర్యవేక్షిస్తుండగా...ఒప్పందాలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 1 నుంచి ఆయా ఫ్రాంచైజీ యజమాన్యాలు నడిపించుకునే విధంగా హక్కులు అందిస్తారు.
అయితే అంతకు ముందే ఆగస్టు 5 నుంచి 31 వరకు జరిగే 2025 సీజన్‌ను కూడా ఈసీబీనే నిర్వహిస్తుంది. ‘హండ్రెడ్’లో ఉన్న జట్లలో నార్తర్న్ సూపర్ చార్జర్స్‌ను 100 శాతం వాటాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ గ్రూప్ సొంతం చేసుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా 70 శాతం వాటాతో మాంచెస్టర్ ఒరిజినల్స్‌ను దక్కించుకున్నారు.
సదరన్ బ్రేవ్ టీమ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జీఎంఆర్ గ్రూప్ 49 శాతం వాటాతో తీసుకోగా...ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కూడా 49 శాతం వాటాతో ఓవల్ ఇన్‌విన్సిబుల్స్‌లో భాగస్వామిగా మారింది. అయితే ఇంకా రిలయన్స్–ఓవల్ ఒప్పందం అధికారికంగా ఖాయం కాలేదు.
ఇదే తరహాలో ట్రెంట్ రాకెట్స్ జట్టుకు సంబంధించి కెయిన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఒప్పందం కూడా ఇంకా పూర్తి కాలేదు. మరో వైపు బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ టీమ్‌కు నైట్‌హెడ్ క్యాపిటల్ సంస్థ, లండన్ స్పిరిట్ టీమ్‌లో క్రికెట్ ఇన్వెస్టర్ హోల్డింగ్స్ లిమిటెడ్, వెల్ష్ ఫైర్ టీమ్‌లో సంజయ్ గోవిల్ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ‘హండ్రెడ్’లో ఎనిమిది జట్ల కోసం బయటి వ్యక్తులను భాగస్వాములుగా చేసుకోవడంలో ఈసీబీలో 500 మిలియన్ పౌండ్‌లు (సుమారు రూ.5,800 కోట్లు) పెట్టుబడుల రూపంలో వచ్చాయి.