IPL 2023: అన్న త్యాగం వల్లే ఇలా కోటీశ్వరుడిగా.. నాన్నను మిస్‌ అవుతున్నా! వాళ్లతో కలిసి ఆడతా

IPL Auction Millionaire Vivrant Sharma Say Irfan Pathan Impacted Him - Sakshi

IPL 2023 Auction- Vivrant Sharma-  Sunrisers Hyderabad: ‘‘మా నాన్నను చాలా మిస్‌ అవుతున్నా. ఆయన ఎక్కడున్నా ఇప్పుడు నా సక్సెస్‌ చూసి సంతోషిస్తూ ఉంటారు. నిజానికి ఇదంతా మా అన్నయ్య త్యాగం వల్లే సాధ్యమైంది. తనే లేకుంటే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడినే కాదు.

నాన్న చనిపోయిన తర్వాత నేను క్రికెట్‌ కొనసాగించగలనా లేదోననే సందేహాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో నా సోదరుడు విక్రాంత్‌ కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. మాకున్న వ్యాపారం ఇప్పుడు తనే చూసుకుంటున్నాడు. 

నిజానికి తను కూడా క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్నాడు. కానీ కుటుంబం కోసం, నా కోసం త్యాగం చేశాడు. తన కలను ఇలా నా రూపంలో నెరవేర్చుకుంటున్నాడు’’ అని జమ్మూ కశ్మీర్‌ బ్యాటర్‌ వివ్రాంత్‌ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. 

కోటీశ్వరుడయ్యాడు
ఐపీఎల్‌ మినీ వేలం-2023లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడి కోసం ఏకంగా 2.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో వివ్రాంత్‌ పంట పండినట్లయింది.

కాగా వివ్రాంత్‌ తండ్రి సుశాంత్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూయగా.. ఇంటికి పెద్ద కుమారుడైన 26 ఏళ్ల విక్రాంత్‌ కుటుంబ బాధ్యతలు చేపట్టాడు. తమ్ముడిని క్రికెట్‌ కొనసాగించేలా ప్రోత్సహించాడు. కాగా విక్రాంత్‌ కూడా యూనివర్సిటీ లెవల్‌ పేసర్‌ కావడం విశేషం.

ఇక ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ తన కోసం ఇంత మొత్తం ఖర్చు చేస్తుందని ఊహించలేదన్న వివ్రాంత్‌.. తనతో పాటు తన కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారంటూ పీటీఐతో వ్యాఖ్యానించాడు. 

ఆయన ప్రోత్సహించారు
అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో ఆయనతో నేను మాట్లాడాను. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నన్ను ప్రోత్సహించారు. విలువైన సలహాలు ఇచ్చారు’’ అని వివ్రాంత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

ఇక ఇప్పటికే సన్‌రైజర్స్‌కు ఆడుతున్న కశ్మీర్‌ ఆటగాళ్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అబ్దుల్‌ సమద్‌తో తనకు స్నేహం ఉందన్న వివ్రాంత్‌.. అవకాశం వస్తే వాళ్లతో కలిసి ఐపీఎల్‌నూ కనిపిస్తానంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా విజయ్‌ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో 124 బంతుల్లో 154 పరుగులు చేసిన వివ్రాంత్‌ ఐపీఎల్‌ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్‌ పడితే నీ ఆట ముగిసేది.. భారత్‌ 89కే ఆలౌట్‌ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్‌ కౌంటర్‌
IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్‌ రీ ఎంట్రీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top