ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై సన్‌రైజర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను బౌలర్లు గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగులు చేసిన సన్‌రైజర్స్, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్‌కేను గెలుపును అడ్డుకున్నారు.
మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తమ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ మాటల్లో..
యువ బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తున్నారు. వారు తమ ప్లాన్‌లను అమలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారు స్వయంగా ప్లాన్‌లు తయారు చేసుకోవడంతో కెప్టెన్‌గా ఫీల్డ్ సెట్ చేయడంలో ఒత్తిడి తగ్గింది. ప్రాక్టీస్ సెషన్స్‌లో వారు కష్టపడి మెరుగుపడుతున్నారు. అందుకే వారిపై పూర్తి నమ్మకం ఉంచి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము.
బ్యాటింగ్‌లో లోటుపై మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ త్వరగా ఔట్ కావడంతో 20–30 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. సాధారణంగా మా టాప్-3లో ఒకరు పెద్ద స్కోరు చేస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో అది జరగలేదు. పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండింది. కాబట్టి 220–230 పరుగులు చేసి ఉండవచ్చు.
పాయింట్స్ టేబుల్‌పై మాట్లాడుతూ.. మేము పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీమెంట్. ఏ మ్యాచ్‌కు ఆ మ్యాచ్‌ను టార్గెట్‌గా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాము. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ, అగ్రెసివ్‌గా ఆడటమే మా కర్తవ్యం.
ఇషాన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే బ్యాటింగ్‌లో మరిన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశం బయటపడింది. మొత్తంగా జట్టు ప్రదర్శన పట్ల ఇషాన్ సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపు తర్వాత సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 21న జరిగే తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా ఎస్‌ఆర్‌హెచ్ సొంత మైదానం హైదరాబాద్‌లోనే జరుగనుంది.


