కోహ్లి, అయ్యర్‌ మెరుపులు.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ | Royal Challengers Bengaluru Storm Into IPL 2026 Playoffs With Dominant 23 Run Win Over Punjab Kings] | Sakshi
Sakshi News home page

కోహ్లి, అయ్యర్‌ మెరుపులు.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ

May 17 2026 7:32 PM | Updated on May 18 2026 11:15 AM

IPL 2026: RCB beat PBKS

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

విరాట్‌ కోహ్లి (58), వెంకటేశ్‌ అయ్యర్‌ (73 నాటౌట్‌) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్‌ (45), టిమ్‌ డేవిడ్‌ (28) కూడా బ్యాట్‌ ఝులిపించారు. జేకబ్‌ బేతెల్‌ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ బ్రార్‌ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్‌ సింగ్‌, చహల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్‌.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. 

ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్‌ కన్నోల్లీ (37), సూర్యాంశ్‌ షేడ్గే (35) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్‌, సుయాశ్‌ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్‌ సింగ్‌ (56), స్టోయినిస్‌ (37) పంజాబ్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. 

వీరు కూడా ఔట్‌ కావడంతో పంజాబ్‌ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్‌ సలాం దార్‌ 3, భువీ 2, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ, షెపర్డ్‌ తలో వికెట్‌ తీశారు. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రియాంశ్‌ ఆర్య 0, ప్రభ్‌సిమ్రన్‌ 2, శ్రేయస్‌ 1, ఒమర్‌జాయ్‌ 14 పరుగులకు ఔటయ్యారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement