ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఆరంభంలో సునాయాసంగా బెర్త్‌లు దక్కించుకుంటాయని భావించిన పలు జట్లు అనూహ్యంగా రేసులో వెనుకపడిపోగా.. అడపాదడపా విజయాలతో సీజన్‌ను ప్రారంభించిన కొన్ని జట్లు అమాంతం రేసులో ముందుకొచ్చాయి.
సీజన్ ప్రారంభంలో ఇరగదీసి, ఆతర్వాత చప్పపడిపోయిన జట్లుగా పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఉండగా.. సీజన్‌ను గొప్పగా ప్రారంభించలేకపోయినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకున్న జట్లుగా గుజరాత్, సన్‌రైజర్స్ ఉన్నాయి. మధ్యస్తంగా ప్లే రేసును కొనసాగిస్తున్న జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఈ ఐదు జట్లే కాకుండా ప్లే ఆఫ్స్ రేసులో బలంగా ఉన్న మరో జట్టు సీఎస్‌కే. ఈ జట్టు సీజన్‌ను వరుస పరాజయాలతో ప్రారంభించి, ఆతర్వాత అమాంత ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.
అయితే తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సీఎస్‌కే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో (ఎస్‌ఆర్‌హెచ్, గుజరాత్) గెలిస్తేనే రేసులో ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించి పనిలేకుండా పోయిన లక్నో సూపర్ జెయింట్స్, ప్రస్తుతం రేసులో ఉన్న జట్లను ఇబ్బంది పెట్టడం పనిగా పెట్టుకుంది. ఇప్పటికే సీఎస్‌కేను ఓడించి ఓ దెబ్బేసిన ఆ జట్టు.. తదుపరి టార్గెట్లుగా రాజస్థాన్, పంజాబ్‌లను పెట్టుకుంది. ఈ రెండు జట్లతోనే లక్నో తమ చివరి ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌ల వల్ల లక్నోకు ఒరిగేదేమీ లేకపోయినా పంజాబ్, రాజస్థాన్ జట్లకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. తొలుత ప్లే ఆఫ్స్ రేసులో దూసుకొచ్చి, ఆతర్వాత అమాంతం పడిపోయిన పంజాబ్‌కు లక్నోతో మ్యాచ్ డు ఆర్ డై పరిస్థితి. ఈ మ్యాచ్‌తో పాటు ఆర్సీబీతో జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ రెంటిలో ఒక్కటి ఓడినా ఖేల్ ఖతమైనట్లే. ఇప్పటికే సీఎస్‌కేకు ఝలక్ ఇచ్చిన లక్నోను చూసి పంజాబ్ జట్టు బిత్తరపోతుంది.
ప్రస్తుతం లక్నోను చూసి జడుసుకుంటున్న మరో జట్టు రాజస్థాన్. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. వీటిలో లక్నోతో ఆడబోయే మ్యాచ్ రాజస్థాన్‌కు కీలకం కానుంది. రాజస్థాన్.. లక్నోతో పాటు ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకుంటుంది.
కాగా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన లక్నో ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్ జట్లకు సింహస్వప్నంగా మారింది. లక్నోను చూసి ఈ రెండు జట్లు జడుసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎస్‌కేను ఇరకాటంలో పడేసని లక్నో.. తమతో పాటు పంజాబ్, రాజస్థాన్‌ను కూడా ఇంటికి తీసుకుపోదామని భావిస్తుంది. సీఎస్‌కే మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు ఆడిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్దమవుతుంది.


