
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అజేయమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో రాహుల్ పలు రికార్డులు సాధించాడు. కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రాహుల్.. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 4 సిక్స్ సాయంతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!
ఈ క్రమంలో రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లో పంజాబ్ తరఫున 2, లక్నో తరఫున 2, ఇప్పుడు ఢిల్లీ తరఫున ఓ సెంచరీ (మొత్తం 5) చేసి ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. తాజా సెంచరీతో తన టీ20 సెంచరీల సంఖ్యను ఏడుకు పెంచుకున్న రాహుల్.. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు:
8 - విరాట్ కోహ్లీ
7 - జోస్ బట్లర్
6 - క్రిస్ గేల్
5 - కేఎల్ రాహుల్*
4 - శుభ్‌మన్ గిల్
4 - షేన్ వాట్సన్
4 - డేవిడ్ వార్నర్
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు:
విరాట్ కోహ్లీ - 9
రోహిత్ శర్మ - 8
అభిషేక్ శర్మ - 7
కేఎల్ రాహుల్ - 7*
ఫాస్టెస్ట్ ఇండియన్‌గా..
ఈ మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లికి ఈ మార్కు తాకేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్ తన 224వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.
ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్ (224), కోహ్లి (243), పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.
రికార్డు సెంచరీ చేసినా ఓడిన ఢిల్లీ
ఈ మ్యాచ్‌లో రాహుల్ రికార్డు సెంచరీతో కదంతొక్కినా ఢిల్లీ ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు.
ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్
ఢిల్లీపై విజయంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్‌కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.