IPL 2024 SRH Vs MI: మలింగ పట్ల అగౌరవంగా ప్రవర్తించిన హార్దిక్‌ పాండ్యా | IPL 2024 SRH Vs MI: Hardik Pandya Unusual Behaviour With MI Bowling Coach Lasith Malinga, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 SRH Vs MI: మలింగ పట్ల అగౌరవంగా ప్రవర్తించిన హార్దిక్‌ పాండ్యా

Published Thu, Mar 28 2024 12:36 PM

IPL 2024 SRH VS MI: Hardik Pandya Unusual Behaviour With MI Bowling coach Lasith Malinga - Sakshi

ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా దురుసు ప్రవర్తన రోజురోజుకు మితిమీరిపోతుంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించలేకపోయిన పాండ్యా.. తన ఓవరాక్షన్‌ కారణంగా సొంత అభిమానులకు కూడా బద్ద శత్రువుగా మారిపోయాడు.

గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తనకంటే చాలా సీనియర్‌ అయిన మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పట్ల అమర్యాదగా (ఫీల్డింగ్‌ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద రోహిత్‌ను అటు ఇటు తిప్పాడు) ప్రవర్తించిన హార్దిక్‌.. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం తన జట్టు బౌలింగ్‌ కోచ్‌, పేస్‌ బౌలింగ్‌ దిగ్గజం లసిత్‌ మలింగ పట్ల కూడా అంతే అగౌరవంగా ప్రవర్తించాడు.

సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి అనంతరం బృంద సభ్యులతో కరచాలనం చేస్తుండగా హార్దిక్‌ మలింగను అయిష్టంగా తోసేసినంత పని చేశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే సొంత అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న హార్దిక్‌.. తన ప్రవర్తన కారణంగా మరిన్ని చిక్కులు తెచ్చుకునేలా ఉన్నాడు.

హార్దిక్‌ సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తాడని ఇదివరకే చాలా సందర్భాల్లో నిరూపితమైనప్పటికీ.. ఎంఐ యాజమాన్యం అండదండలు ఉండటంతో అతని ఆటలు సాగుతున్నాయి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ అనంతరం మలింగను అవమానించిన సందర్భానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. హార్దిక్‌పై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్న రోహిత్‌ అభిమానులు ఈ వీడియోను చూసి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

హార్దిక్‌ను వెంటనే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. హార్దిక్‌కు జట్టులో సహచర ఆటగాళ్లతో సఖ్యత లేదన్న విషయాలను హైలైట్‌ చేస్తున్నారు. ప్రస్తుత జట్టులో హార్దిక్‌, ఇషాన్‌ కిషన్‌ ఒకవైపు.. మిగతా ఆటగాళ్లంతా మరోవైపు ఉన్నారని అంటున్నారు.  ఈ విషయాన్ని దైనిక్‌ జాగ్రన్‌ అనే వెబ్‌సైట్‌ కూడా వెల్లడించింది. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ముంబైకు ఇది వరసగా రెండో ఓటమి.
 

Advertisement
Advertisement